చిక్కుల్లో క‌మ‌ల్ హాస‌న్‌... బెంగళూరులో కేసు న‌మోదు

  • కన్నడ భాష తమిళం నుంచే పుట్టింద‌న్న క‌మ‌ల్‌
  • ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై కన్నడిగుల‌ ఆగ్రహం
  • కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు 
  • కమల్ వ్యాఖ్యలను ఖండిస్తూ రంగంలోకి దిగిన కేఆర్‌వీ
  • బెంగళూరులోని ఆర్‌టీ నగర్ పీఎస్‌లో ఆయ‌న‌పై ఫిర్యాదు
'కన్నడ భాష తమిళం నుంచే పుట్టింది' అని ప్ర‌ముఖ న‌టుడు కమల్ హాసన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో దుమారం రేపుతున్నాయి. తన తాజా చిత్రం ‘థగ్ లైఫ్’ ఆడియో రిలీజ్ ఈవెంట్‌లో ఆయ‌న‌ చేసిన ఈ వ్యాఖ్యలు కన్నడిగుల‌ ఆగ్రహానికి కార‌ణ‌మ‌య్యాయి. 

ఆయ‌న వ్యాఖ్యల నేపథ్యంలో కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ క్ర‌మంలో కమల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ కర్ణాటక రక్షణ వేదిక (కేఆర్‌వీ) రంగంలోకి దిగింది. బెంగళూరులోని ఆర్‌టీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఆయ‌న‌పై ఫిర్యాదు చేసింది. 

కమల్ వ్యాఖ్యలు కన్నడిగుల మనోభావాలను దెబ్బతీశాయని, కన్నడిగులు, తమిళుల మధ్య విద్వేషాలను సృష్టించేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొంది. ఆయనపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేఆర్‌వీ డిమాండ్ చేసింది. దీంతో క‌మ‌ల్‌పై పోలీసులు కేసు న‌మోదు చేసిన‌ట్లు తెలుస్తోంది. 

సారీ చెప్పిన‌ కమల్
అయితే, త‌న‌ వ్యాఖ్యలపై కమల్ హాసన్ స్పందిస్తూ ఇప్ప‌టికే సారీ చెప్పారు. తాను ప్రేమతో ఆ వ్యాఖ్యలు చేశానని, ఎవరినీ అగౌరవపరచాలనే ఉద్దేశం తనకు లేదని అన్నారు. భాషల చరిత్ర గురించి మాట్లాడే అర్హత రాజకీయ నాయకులకు లేదని పేర్కొన్నారు. ఈ చర్చను చరిత్రకారులు, భాషా నిపుణులకు వదిలేయాలని అన్నారు. 

ఇక‌, కమల్ హాసన్ వ్యాఖ్యల కార‌ణంగా కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో క‌న్న‌డిగులు నిరసనల‌కు దిగారు. కొన్నిచోట్ల ఆయ‌న థ‌గ్ లైఫ్ మూవీ పోస్టర్లను దహనం చేయ‌డంతో పాటు క‌మ‌ల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ వివాదం ‘థగ్ లైఫ్’ సినిమా రిలీజ్‌పై కూడా ప్రభావం చూపే అవకాశం లేక‌పోలేదని సినీ విశ్లేష‌కులు చెబుతున్నారు.

కాగా, ఈ వివాదంపై కర్ణాటక రాజకీయ నేత‌లు కూడా స్పందించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ, కమల్‌కు కన్నడ భాష చరిత్రపై సరైన అవగాహన లేదన్నారు. ఇతర భాషలను అవమానించడం సరైంది కాదని పేర్కొన్నారు. కర్ణాటక బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర కూడా కమల్ వ్యాఖ్యలపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ నేప‌థ్యంలో పలువురు నేతలు క‌మ‌ల్ హాస‌న్‌ సినిమాలను కర్ణాటకలో నిషేధించాలని కోరారు.


More Telugu News