సివిల్స్ ర్యాంకర్ సాయి శివానిని సత్కరించిన సజ్జనార్

  • సివిల్స్‌లో 11వ ర్యాంకు సాధించిన సాయి శివాని
  • టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ చేతుల మీదుగా సత్కారం
  • చిన్న వయసులోనే అత్యుత్తమ ర్యాంకు సాధించారని ప్రశంస
  • స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉండి లక్ష్య సాధన
  • బస్ భవన్‌లో కుటుంబ సభ్యులతో కలిసి సజ్జనార్‌ను కలిసిన శివాని
 సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 11వ ర్యాంకు సాధించిన వరంగల్‌కు చెందిన ఇట్టబోయిన సాయి శివానిని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ ఘనంగా సత్కరించారు. గురువారం హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. సాయి శివాని తన తల్లిదండ్రులు రాజు, రజితతో కలిసి సజ్జనార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా వీసీ సజ్జనార్ మాట్లాడుతూ, సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన సాయి శివాని చిన్న వయసులోనే సివిల్స్‌లో గొప్ప ర్యాంకు సాధించి ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. నేటి డిజిటల్ యుగంలో చాలా మంది యువత స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియాతో సమయం వృధా చేసుకుంటుంటే, సాయి శివాని స్మార్ట్ ఫోన్ ముట్టుకోకుండా, సోషల్ మీడియా జోలికి వెళ్లకుండా అనుకున్న ల‌క్ష్యాన్ని చేరుకోవడం అభినందనీయమని ప్రశంసించారు. భవిష్యత్తులో విధి నిర్వహణలో కూడా ఇదే అంకితభావంతో పనిచేసి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు.

సాయి శివాని మేనమామ ప్రకాశ్ రావు టీజీఎస్ఆర్టీసీలో డీఎం హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సాయి శివాని తన కుటుంబ సభ్యులతో కలిసి సంస్థ ఎండీని కలిశారు. ఈ కార్యక్రమంలో టీజీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునిశేఖర్, సిరిసిల్ల డీఎం ప్రకాశ్ రావు తదితరులు పాల్గొన్నారు.


More Telugu News