ఐరాస తీరుపై భారత్ తీవ్ర అసంతృప్తి, రాజ్ నాథ్ విమర్శలు

  • ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌కు వైస్ చైర్మన్ గా పాకిస్థాన్ ను నియమించిన ఐరాస
  • ఐక్యరాజ్యసమితి నిర్ణయాలు ఇటీవలి కాలంలో ప్రశ్నార్థకంగా మారాయన్న రాజ్‌నాథ్ 
  • 9/11 సూత్రధారికి పాక్ ఆశ్రయం ఇచ్చిందని గుర్తుచేసిన కేంద్ర రక్షణ మంత్రి
  • ఉగ్రవాదానికి పాకిస్థానే తండ్రి లాంటిదింటూ విమర్శలు
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఐక్యరాజ్యసమితి (ఐరాస) తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా, ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్ వైఖరిని ప్రస్తావిస్తూ, అలాంటి దేశానికి ఐరాస భద్రతా మండలి ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌లో వైస్ ఛైర్మన్ పదవి ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. మంగళవారం డెహ్రాడూన్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో పాకిస్థాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాల నిర్మూలన అంశంపై మాట్లాడుతూ రాజ్‌నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

అమెరికాలో 9/11 దాడుల అనంతరం ఏర్పాటైన ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌కు పాకిస్థాన్‌ను వైస్ ఛైర్మన్ గా నియమించడం హాస్యాస్పదంగా ఉందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. "ఆ దాడికి సూత్రధారి అయిన వ్యక్తికి పాకిస్థాన్ ఆశ్రయం కల్పించిందన్న విషయం అందరికీ తెలుసు. ఇది పాలకు పిల్లిని కాపలా పెట్టినట్టుగా ఉంది" అని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ భద్రతకు సంబంధించిన విషయాల్లో ప్రభుత్వ వైఖరి మరియు కార్యాచరణ పద్ధతిని మార్చిందని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. దీనికి తాజా, ఉత్తమ ఉదాహరణ 'ఆపరేషన్ సింధూర్' అని, ఇది భారతదేశ చరిత్రలోనే ఉగ్రవాదంపై జరిగిన అతిపెద్ద చర్య అని ఆయన అభివర్ణించారు.

పాకిస్థాన్‌ను ఉగ్రవాదానికి తండ్రి (ఫాదర్ ఆఫ్ టెర్రరిజం) గా అభివర్ణించిన రాజ్‌నాథ్, ఆ దేశం ఎప్పుడూ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ, వారికి శిక్షణ ఇస్తూ, అనేక రకాలుగా తన గడ్డపై సహాయం అందిస్తోందని ఆరోపించారు. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నిర్మూలించాలంటే, "ఈ రోజు ప్రపంచంలో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చి, ఆశ్రయం కల్పిస్తున్న దేశాలను బహిర్గతం చేయడం కూడా చాలా ముఖ్యం" అని ఆయన నొక్కి చెప్పారు.

పాకిస్థాన్‌కు లభించే ఆర్థిక సహాయంలో పెద్ద భాగం ఉగ్రవాదంపైనే ఖర్చు అవుతోందని, ఈ విషయంపై ప్రపంచం ఇప్పుడు మేల్కొంటోందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అయితే, ఉగ్రవాదంపై పోరులో పెద్ద బాధ్యత కలిగిన ఐక్యరాజ్యసమితి ఈ విషయంలో ఒకే మాటపై నిలబడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. "దురదృష్టవశాత్తు, ఇటీవలి సంవత్సరాలలో ఐరాస తీసుకున్న అనేక నిర్ణయాలు ప్రశ్నార్థకంగా మారాయి" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


More Telugu News