వివాదాలకు చెక్.. సీఎం చంద్ర‌బాబుతో సినీ పెద్ద‌ల భేటీకి ముహూర్తం ఖరారు

  • ఈ నెల 15న చంద్ర‌బాబు టాలీవుడ్ పెద్ద‌ల స‌మావేశం
  • డిప్యూటీ సీఎం ప‌వ‌న్ ఆధ్వ‌ర్యంలోనే సీఎంతో భేటీ
  • కొలిక్కి రానున్న టాలీవుడ్ సమస్యలు, వివాదాలు
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలు, వివాదాలకు త్వరలో తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబుతో సినీ పరిశ్రమకు చెందిన కీలక వ్యక్తుల సమావేశానికి ముహూర్తం ఖరారైంది. ఈ భేటీతో ప్రస్తుతం నెలకొన్న అనేక అపరిష్కృత అంశాలకు ఒక ముగింపు లభిస్తుందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

కూట‌మి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది కావస్తున్నా, సినీ పరిశ్రమ పెద్దలతోగానీ, ప్రభుత్వ అధికారులతోగానీ ఇప్పటివరకు సరైన చర్చలు జరగలేదన్న అసంతృప్తి కొంతకాలంగా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా నటుడు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల ఈ విషయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడి ఇంతకాలమైనా ముఖ్యమంత్రితో అధికారిక సమావేశం జరగకపోవడంపై ఆయన గట్టిగానే తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ నెల 15వ తేదీన ఉండవల్లిలో చంద్రబాబును కలిసేందుకు అప్పాయింట్ మెంట్ కోరారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు ఈ మేరకు అప్పాయింట్ మెంట్ ఖరారైనట్లు సమాచారం. దాదాపు 30 మంది వరకు సినీ రంగ ప్రముఖులు ఏపీ సీఎంను కలవనున్నట్లు తెలుస్తోంది. అల్లు అరవింద్, దిల్ రాజు పరిశ్రమ నుంచి పెద్దలుగా తమ సమస్యలను చంద్రబాబుకు వివరించనున్నారు. 

త్వరలో జరగనున్న ఈ సమావేశం, సినీ పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్ష చర్చలకు వేదిక కానుంది. ఈ భేటీలో ప్రధానంగా సినిమా నిర్మాణం, ప్రదర్శనకు సంబంధించిన విధానాలు, పన్నుల అంశాలు, బెనిఫిట్ షోలు, టికెట్ ధరల నియంత్రణ వంటి కీలక విషయాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ముఖ్యంగా, ఇటీవల కొన్ని పెద్ద సినిమాల విడుదల సమయంలో టికెట్ ధరలు, ప్రత్యేక ప్రదర్శనలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ అంశాలపై స్పష్టత వస్తుందని ఆశిస్తున్నారు.

చాలాకాలంగా టాలీవుడ్‌కు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య ఉన్న సత్సంబంధాలకు కొంతకాలంగా అడ్డంకిగా మారిన వివాదాలకు ఈ సమావేశంతో ఎండ్ కార్డ్ పడుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 


More Telugu News