ఈ ఓటీటీ వేదికలో ఇక వాణిజ్య ప్రకటనల హోరు!

  • జూన్ 17 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో యాడ్స్ 
  • అధికారికంగా ప్రకటించిన కంపెనీ
  • యాడ్స్ లేకుండా సినిమాలు, వెబ్ సిరీస్ చూడాలనుకునే వారు నెలవారీ రూ.129లు, ఏడాదికి అయితే రూ.699లు అదనపు రుసుము చెల్లించాలి
ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇప్పటి వరకు ప్రకటనలు లేకుండా సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. అయితే, ఆదాయాన్ని పెంచుకునే మార్గంలో భాగంగా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సంస్థ ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

ఇకపై సినిమాలు, వెబ్ సిరీస్‌లలో ప్రకటనలు ప్రసారం చేయాలని నిర్ణయించింది. ఈ నెల 17 నుంచి ఈ కొత్త విధానం అమలులోకి తీసుకురానున్నట్లు అమెజాన్ అధికారికంగా ప్రకటించింది. అయితే, తాజాగా దీనిపై మరికొన్ని సవరణలు చేసినట్లు తెలుస్తోంది.

తాజా నిబంధనల ప్రకారం, ప్రతి గంటకు ఆరు నిమిషాల పాటు ప్రకటనలు ప్రసారం చేయాలని నిర్ణయించింది. ప్రకటనలతో కూడిన కంటెంట్‌ను చూడటానికి అభ్యంతరం లేని వారు ప్రస్తుత ప్లాన్‌లోనే కొనసాగవచ్చని వెల్లడించింది. ప్రకటనలు లేకుండా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడాలనుకునే వారు నెలకు రూ.129, సంవత్సరానికి రూ.699 అదనపు రుసుముతో కొత్త ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంతో కంటెంట్‌పై మరింత ఎక్కువగా పెట్టుబడి పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెజాన్ పేర్కొంది.

భారత ఓటీటీ మార్కెట్‌లో తీవ్రమైన పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెజాన్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం వినియోగదారులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సి ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్ వంటి కొన్ని ప్రధాన వేదికలు ఇప్పటికే ప్రకటనలు లేని సేవలను అందిస్తున్నాయి. అమెజాన్ తీసుకున్న తాజా నిర్ణయం వినియోగదారులను ఇతర వేదికల వైపు ఆకర్షించే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 


More Telugu News