ప్రేమ నాటకం.. చివరకు ప్రాణం తీశాడు! మోడల్ హత్య కేసులో వెలుగులోకి షాకింగ్ నిజాలు

  • హర్యానాలో మోడల్ షీతల్ చౌదరి దారుణ హత్య
  • గొంతు కోసి, కత్తితో పొడిచి చంపి కాలువలో పడేసిన ప్రియుడు
  • తొలుత కారు ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం
  • విచారణలో నేరం అంగీకరించిన సునీల్
  •  పెళ్లయిన సునీల్‌కు ఇద్దరు పిల్లలు, షీతల్‌కు కూడా పెళ్లై చిన్నారి
హర్యానాలో దారుణ హత్యకు గురైన మోడల్ శీతల్ చౌదరి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె ప్రియుడైన సునీలే ఆమెను దారుణంగా హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. సునీల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణలో అతడు చెప్పిన విషయాలు విని విస్తుపోయారు. పోలీసుల కథనం ప్రకారం.. మోడల్ అయిన శీతల్ చౌదరి అలియాస్ సిమి మృతదేహం నిన్న సోనిపట్ సమీపంలోని ఖర్ఖోడా వద్ద ఒక కాలువలో లభ్యమైంది. ఆమె గొంతు కోసి ఉండటమే కాకుండా, శరీరంపై అనేక కత్తిపోట్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. చేతిపైన, ఛాతీపైన ఉన్న టాటూల ఆధారంగా మృతదేహాన్ని శీతల్‌దిగా ఆమె కుటుంబ సభ్యులు గుర్తించారు. పానిపట్ నుంచి సుమారు 80 కిలోమీటర్ల దూరానికి మృతదేహం కొట్టుకువచ్చినట్టు అధికారులు తెలిపారు. 
 
ప్రమాదంగా నమ్మించే యత్నం
అంతకుముందు ఆదివారం (15న) పానిపట్ సమీపంలోని కాలువలో శీతల్ ప్రియుడు సునీల్ కారును పోలీసులు కనుగొన్నారు. అయితే, అందులో శీతల్ లేదు. అదే సమయంలో సునీల్ పానిపట్‌లోని ఒక ఆసుపత్రిలో చేరాడు. తన కారు కాలువలో పడిపోయిందని, శీతల్ నీటిలో మునిగిపోయిందని, తాను మాత్రం ఈదుకుంటూ బయటపడి ప్రాణాలు కాపాడుకున్నానని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే, పోలీసుల దర్యాప్తులో సునీల్ నాటకం బయటపడింది. శీతల్ మృతదేహం లభించిన తర్వాత, అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా, తానే శీతల్‌ను హత్య చేసినట్టు తాజాగా నేరం అంగీకరించాడు.

 పోలీసుల కథనం ప్రకారం.. శనివారం (14న) పానిపట్‌లోని అహర్ గ్రామంలో ఒక ఆల్బమ్ షూటింగ్ కోసం శీతల్ వచ్చింది. రాత్రి 10:30 గంటల సమయంలో సునీల్ ఆమెను కలవడానికి అక్కడికి వచ్చాడు. ఇద్దరూ సునీల్ కారులో వెళ్లారు. అక్కడ మద్యం తాగిన తర్వాత వారి మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. అర్ధరాత్రి సుమారు 1:30 గంటలకు శీతల్ తన సోదరి నేహాకు వీడియో కాల్ చేసి సునీల్ తనను కొడుతున్నాడని చెప్పింది. ఆ తర్వాత కాసేపటికే శీతల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని, ఆమె అందుబాటులోకి రాలేదని నేహా పోలీసులకు తెలిపింది. ఆ వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో శీతల్‌ను సునీల్ దారుణంగా కొట్టి, కత్తితో పలుమార్లు పొడిచి హత్య చేసి, మృతదేహంతో సహా కారును కాలువలోకి తోసేసినట్లు విచారణలో తేలింది.

 ఆరేళ్ల పరిచయం.. పెళ్లి ప్రతిపాదన తిరస్కరణ 
సునీల్‌కు కర్నాల్‌లో ఒక హోటల్ ఉందని, అక్కడ శీతల్ గతంలో పనిచేసినట్టు తెలిసింది. వీరిద్దరికీ ఆరేళ్లుగా పరిచయం ఉంది. శీతల్‌ వద్ద సునీల్ పెళ్లి ప్రతిపాదన తెచ్చినట్టు సమాచారం. అయితే, సునీల్‌కు అప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలియడంతో శీతల్ ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. హర్యానీ మ్యూజిక్ ఇండస్ట్రీలో పనిచేసే శీతల్‌కు కూడా వివాహమై ఐదు నెలల చిన్నారి ఉంది. శీతల్ హత్యకు దారితీసిన కచ్చితమైన కారణాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. 


More Telugu News