ఒంటరి పోరాటం చేస్తూనే ఉన్నాను: రైటర్ మరుధూరి రాజా

  • జంధ్యాలగారు నాకు ఛాన్స్ ఇచ్చారు 
  • ఆయన సినిమాలకి పనిచేయడం అదృష్టం
  • ప్రతివాళ్లూ ఒంటరి పోరాటం చేయాల్సిందే 
  • రచన అన్నం పెడుతుందని అనుకోలేదన్న రచయిత

తెలుగు తెరపై కామెడీని పరుగెత్తించిన సినిమా రచయితలలో మరుధూరి రాజా ఒకరు. హాస్యానికి తన మార్క్ ను జోడించినవారాయన. తెరపై ఆయన కార్డు చూసి 'హమ్మయ్య ..  హాయిగా నవ్వుకోవచ్చు' అని ఆడియన్స్ అనుకున్న రోజులు ఉన్నాయి. అలాంటి మరుధూరి రాజా, ఐడ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు. 

" చిన్నప్పటి నుంచి నాకు రచన పట్ల ఆసక్తి ఉండేది. మా అన్నయ్య ఎమ్ వీ ఎస్ హరనాథరావు ప్రభావం అందుకు ఒక కారణం కావొచ్చు. ఆయన మాదిరిగానే నేను కూడా నాటకాలు రాయడంతో నా కెరియర్ ను మొదలుపెట్టాను. సరదాగా నేను నాటకాలు రాస్తూ వెళ్లాను. అదే నాకు అన్నం పెడుతుందని అనుకోలేదు. నేను రాసిన ఒక నాటకం చూసి జంధ్యాల గారు నన్ను పిలిపించారు. ఆయన దగ్గర పనిచేయడం నాకు ఎంతో సంతోషాన్ని .. గర్వాన్ని కలిగించిన విషయం" అని చెప్పారు. 

"రచయితగా ప్రయాణాన్ని మొదలుపెట్టిన తరువాత చాలా సినిమాలకు పనిచేశాను. ఇండస్ట్రీకి వచ్చిన తరువాత ఒంటరి పోరాటం చేశాను .. ఇప్పటికీ చేస్తున్నాను. పోటీ .. పోరాటం లేనిదెక్కడ? ఒంటరిపోరాటం చేస్తున్నానుగానీ ఒంటరివాడిని కాదు. నన్ను ఆత్మీయంగా చూసుకునేవాళ్లు చాలామంది ఉన్నారు. నాకు తాగుడు అలవాటు ఉందిగానీ .. అది వ్యసనం కాదు. రాసినంత సేపు తాగిన సందర్భాలు ఉన్నాయి. తాగుతున్నంతసేపు రాసిన సందర్భాలు ఉన్నాయి" అంటూ తన మార్క్ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. 



More Telugu News