మంచు విష్ణు కార్యాలయాల్లో జీఎస్టీ సోదాలు.. ఆసక్తికరంగా స్పందించిన మంచు హీరో!

  • మంచు విష్ణు కార్యాలయాల్లో కేంద్ర జీఎస్టీ అధికారుల తనిఖీలు
  • 'కన్నప్ప' సినిమా జీఎస్టీ చెల్లింపుల్లో తేడాలున్నాయని అనుమానం
  • మాదాపూర్, కావూరి హిల్స్‌లోని ఆఫీసుల్లో రెండు బృందాల సోదాలు
  • ఆఫీసుకు చేరుకున్న నటుడు మోహన్ బాబు
  • దాపరికం ఏమీ లేదన్న విష్ణు, ఎక్కడెక్కడ అప్పులు చేశామో తెలుస్తాయని వ్యాఖ్య
ప్రముఖ సినీ నటుడు మంచు విష్ణుకు చెందిన కార్యాలయాల్లో బుధవారం కేంద్ర జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లోని మాదాపూర్, కావూరి హిల్స్‌లో ఉన్న ఆయన కార్యాలయాలపై ఏకకాలంలో రెండు ప్రత్యేక బృందాలు ఈ సోదాలు నిర్వహించాయి.

'కన్నప్ప' సినిమాకు సంబంధించిన జీఎస్టీ చెల్లింపుల విషయంలో కొన్ని వ్యత్యాసాలు ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సంబంధిత ఆర్థిక రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ తనిఖీల విషయం తెలియగానే, మంచు విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మోహన్ బాబు కూడా కార్యాలయానికి చేరుకున్నారు.

విష్ణు ఏమన్నారంటే...?

ఈ పరిణామాలపై మీడియా ప్రతినిధులు మంచు విష్ణును ప్రశ్నించగా, "మీరు చెప్పేంత వరకు నాకు ఈ విషయం తెలియదు. అయినా, ఇందులో దాచిపెట్టడానికి ఏమీ లేదు. ఎక్కడెక్కడ అప్పులు చేశామో ఈ తనిఖీల ద్వారా తెలుస్తుంది కదా" అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇదే సందర్భంగా 'కన్నప్ప' సినిమా గురించి కూడా విష్ణు ప్రస్తావించారు. "ఇటీవలే హిందీలో సినిమా ఫైనల్ కాపీ చూశాను. సినిమా చివరి సన్నివేశాలు చూసి అక్కడ కొందరు ప్రముఖుల రోమాలు నిక్కబొడుచుకున్నాయని చెప్పారు. ప్రేక్షకులు కూడా ఇదే విధమైన అనుభూతిని పొందుతారని ఆశిస్తున్నాను. ఇది దేవుడికి, భక్తుడికి మధ్య ఉండే ఒక పవిత్రమైన కథ. కన్నప్ప గొప్పతనాన్ని ఈ తరం వారికి తెలియజేయాలన్నదే మా ముఖ్య ఉద్దేశం" అని విష్ణు వివరించారు.

ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో మంచు విష్ణు తిన్నడు/కన్నప్ప పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్‌, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు. 


More Telugu News