ఆ మాటలు నేను అనలేదు: పెళ్లి వ్యాఖ్యలపై ప్రియాంకా చోప్రా క్లారిటీ

  • పెళ్లిళ్లపై తాను చేసినట్లుగా ప్రచారంలో ఉన్న వ్యాఖ్యలను ఖండించిన ప్రియాంకా చోప్రా
  • అవి తాను చేయలేదని, సామాజిక మాధ్యమాల్లో ఎవరో సృష్టించారని వెల్లడి
  • ఆన్‌లైన్‌లో వచ్చే ప్రతి వార్తను నమ్మవద్దని ప్రజలకు సూచన
  • ఇతరుల దృష్టిని ఆకర్షించడానికే ఇలాంటివి వైరల్ చేస్తారని వ్యాఖ్య
  • ఏదైనా నమ్మే ముందు ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకోవాలని విజ్ఞప్తి
ప్రముఖ సినీ నటి ప్రియాంకా చోప్రా, పురుషులు ఎలాంటి మహిళలను వివాహం చేసుకోవాలనే అంశంపై తాను చేసినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వ్యాఖ్యలపై తాజాగా స్పందించారు. ఆ వ్యాఖ్యలు తాను చేయలేదని ఆమె స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు వార్తలు సులభంగా వైరల్ అవుతుండటం విచారకరమని ఆమె అన్నారు.

"వర్జినిటీ ఉన్న అమ్మాయిని కాదు, మంచి గుణాలున్న మహిళను వివాహం చేసుకోండి. ఎందుకంటే వర్జినిటీ అనేది ఒక్క రాత్రితో పోతుంది కానీ, సభ్యత, సంస్కారం జీవితాంతం ఉంటాయి" అంటూ ప్రియాంక వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరిగింది. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ఈ నేపథ్యంలో, సదరు వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ప్రియాంకా చోప్రా, వాటిని తీవ్రంగా ఖండించారు. "ఇలాంటి వ్యాఖ్యలు నేను చేయలేదు. ఈ విధంగా నేను ఎక్కడా మాట్లాడలేదు. ఇది కేవలం సామాజిక మాధ్యమాలలో ఎవరో సృష్టించిన వార్త మాత్రమే, ఇందులో ఎలాంటి నిజం లేదు" అని ఆమె స్పష్టం చేశారు.

ఇతరుల దృష్టిని ఆకర్షించి, వైరల్ కావడం కోసం ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం ఈ రోజుల్లో చాలా తేలికైపోయిందని ప్రియాంక ఆవేదన వ్యక్తం చేశారు. "ఇలాంటి వార్తలను నమ్మే ముందు దయచేసి ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఆన్‌లైన్‌లో కనిపించే ప్రతి వార్తనూ గుడ్డిగా నమ్మవద్దు" అని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి తప్పుడు సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.


More Telugu News