గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా

  • ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో టీమిండియా ఓటమి
  • హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై తీవ్రంగా పెరుగుతున్న ఒత్తిడి
  • గత 9 టెస్టుల్లో భారత్ 7 మ్యాచ్‌లు కోల్పోయిందని విశ్లేషణ
  • ఈ సిరీస్‌లో ఫలితాలు రాకుంటే గంభీర్ పదవికే ప్రమాదం
  • మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
ఇంగ్లాండ్ పర్యటనను టీమిండియా పరాజయంతో ప్రారంభించిన విష‌యం తెలిసిందే. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 800కు పైగా పరుగులు సాధించి, ఏకంగా ఐదు సెంచరీలు నమోదు చేసినప్పటికీ భారత జట్టుకు ఓటమి తప్పలేదు. ఈ వైఫల్యంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఆయన కోచింగ్‌లో జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానల్‌లో స్పందించాడు. "టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతమ్ గంభీర్‌పై ప్రస్తుతం చాలా ఒత్తిడి ఉంది. అది రోజురోజుకూ పెరుగుతోంది. ఆయన మార్గదర్శకత్వంలో భారత్ ఆడిన చివరి తొమ్మిది టెస్టుల్లో కేవలం రెండింటిలోనే గెలిచింది. ఏకంగా ఏడు మ్యాచ్‌లలో ఓటమి చవిచూసింది" అని విశ్లేషించాడు. గంభీర్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్‌పై రెండు, ఆస్ట్రేలియాపై ఒక టెస్టు గెలిచిన జట్టు.. న్యూజిలాండ్‌తో మూడు, ఆస్ట్రేలియాతో మూడు, తాజాగా ఇంగ్లాండ్‌తో ఒక మ్యాచ్‌లో ఓడిపోయిందని ఆయన గుర్తుచేశాడు.

ప్రస్తుత ఇంగ్లాండ్ సిరీస్‌లో జట్టు ప్రదర్శన మెరుగుపడకపోతే గంభీర్ తన ప్రధాన కోచ్ పదవిని కోల్పోయే ప్రమాదం కూడా ఉందని ఆకాశ్ చోప్రా హెచ్చరించాడు. "ఈ పర్యటనలో టీమిండియాకు అనుకూల ఫలితాలు రాకపోతే గౌతమ్ గంభీర్ తన పదవిని కోల్పోవచ్చు. ఎందుకంటే జట్టు యాజమాన్యం కోరిన ఆటగాళ్లనే సెలక్టర్లు ఎంపిక చేశారు. అడిగిన ప్లేయర్స్‌ను జట్టులోకి తీసుకున్న తర్వాత కూడా ఫలితాలు రాకపోతే ఇబ్బందులు తప్పవు" అని ఆయన స్పష్టం చేశాడు. దీంతో ఈ సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌ల ఫలితాలు గంభీర్ భవిష్యత్తును నిర్ణయించనున్నాయని క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది.




More Telugu News