'కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా!

  • 'కాంటా లగా' పాట ఫేమ్ నటి షఫాలీ జరివాలా ఆకస్మిక మరణం
  • గుండెపోటుతో మృతి చెందినట్లు తొలుత వెలువడిన వార్తలు
  • ఆమె మృతిపై అనుమానాలున్నాయని ప్రకటించిన ముంబ‌యి పోలీసులు
  • అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభం
  • అంధేరిలోని ఫ్లాట్‌లో ఫోరెన్సిక్ నిపుణుల క్షుణ్ణమైన తనిఖీలు
ఒకప్పటి సెన్సేషనల్ సాంగ్ 'కాంటా లగా'తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి షఫాలీ జరివాలా (42) ఆకస్మిక మరణం తీవ్ర కలకలం రేపుతోంది. ఆమె గుండెపోటుతో మరణించారని తొలుత వార్తలు వచ్చినా, ఈ ఘటనపై తాజాగా ముంబ‌యి పోలీసులు స్పందించడంతో కేసు కీలక మలుపు తిరిగింది. షఫాలీ మరణాన్ని అనుమానాస్పద మృతిగా పరిగణిస్తున్నామని, అసలు కారణాలు ఇంకా తెలియరాలేదని ప్రకటించడంతో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అర్ధరాత్రి సుమారు ఒంటి గంట సమయంలో తమకు సమాచారం అందిందని, వెంటనే అంధేరిలోని షఫాలీ నివాసానికి చేరుకున్నామని తెలిపారు. "మేము ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించాం. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం కూపర్ ఆసుపత్రికి తరలించాం. ఆమె మరణానికి దారితీసిన కచ్చితమైన కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు" అని పోలీసులు వెల్లడించారు. 

ఈ కేసును అనుమానాస్పద ఘటనగానే నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ముంబ‌యి పోలీసు తెలిపారు. ప్రస్తుతం ఫోరెన్సిక్ నిపుణులు షఫాలీ అపార్ట్‌మెంట్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో పోలీసులు ఆమె ఇంట్లో పనిచేసే సిబ్బందిని, వంట మనిషిని ప్రశ్నిస్తున్నారు.

శుక్రవారం రాత్రి షఫాలీ అస్వస్థతకు గురవడంతో ఆమె భర్త పరాగ్ త్యాగీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, కుటుంబ సభ్యులు ఆమె మరణంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. "రాత్రి 11:15 గంటలకు షఫాలీని ఆసుపత్రికి తీసుకొచ్చారు. కానీ, అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది" అని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఈ ఉదయం షఫాలీ భర్త పరాగ్ త్యాగీ తమ పెంపుడు శునకంతో అపార్ట్‌మెంట్ బయట నడుస్తూ కనిపించడం గమనార్హం.

2002లో విడుదలైన 'కాంటా లగా' రీమిక్స్ వీడియో సాంగ్‌తో షఫాలీ జరివాలా ఒక్క రాత్రిలోనే స్టార్‌గా ఎదిగారు. యువతలో ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ నటించిన 'ముజ్సే షాదీ కరోగి' చిత్రంలో చిన్న పాత్రలో మెరిశారు. పలు టెలివిజన్ రియాలిటీ షోలలో పాల్గొన్న ఆమె, హిందీ బిగ్‌బాస్ సీజన్ 13లోనూ పోటీదారుగా అడుగుపెట్టారు. వ్యక్తిగత జీవితంలో ఆమె మొదట మ్యుజీషియన్ హర్మీత్ సింగ్‌ను వివాహం చేసుకుని, ఆ తర్వాత విడిపోయారు. అనంతరం నటుడు పరాగ్ త్యాగీని పెళ్లి చేసుకున్నారు. షఫాలీ మృతికి అసలు కారణం పోస్ట్‌మార్టం నివేదిక వస్తేనే తేలనుంది. పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.


More Telugu News