దేశంలో తొలి ఏఐ డిజిటల్ హైవే... ఎక్కడో తెలుసా?

  • ఢిల్లీ-గురుగ్రామ్‌లను కలిపే ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేపై ఏఐ ఆధారిత స్మార్ట్ ట్రాఫిక్ వ్యవస్థ 
  • సీటు బెల్ట్, స్పీడ్ సహా 14 రకాల ఉల్లంఘనలను పసిగట్టే కెమెరాలు
  • నిబంధనలు మీరితే నేరుగా పోలీసులకు, ఈ-చలాన్ పోర్టల్‌కు సమాచారం
  • ప్రమాదాలు, అడ్డంకులను గుర్తించి వెంటనే కంట్రోల్ రూమ్‌ను అప్రమత్తం
  • దేశవ్యాప్తంగా అన్ని జాతీయ రహదారులకు ఈ వ్యవస్థ విస్తరణకు ప్లాన్
భారత జాతీయ రహదారులు సరికొత్త టెక్నాలజీతో రూపు మార్చుకుంటున్నాయి. వాహనదారుల భద్రత, ట్రాఫిక్‌ నియంత్రణే లక్ష్యంగా దేశంలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత 'అడ్వాన్స్‌డ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్ (ఏటీఎంఎస్)' అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీ-గురుగ్రామ్‌లను కలిపే ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ స్మార్ట్ వ్యవస్థను తాజాగా ప్రారంభించారు. దీని ద్వారా దేశంలో తొలి ఏఐ ఆధారిత డిజిటల్ హైవేగా ఈ రహదారి గుర్తింపు పొందింది.

ఏమాత్రం తేడా వచ్చినా పసిగట్టేస్తుంది!

ఈ అత్యాధునిక వ్యవస్థతో హైవేలపై నిబంధనల ఉల్లంఘనలకు చెక్ పెట్టడం చాలా సులువు కానుంది. వాహనదారులు సీటు బెల్టు పెట్టుకోకపోయినా, టూవీలర్‌పై ట్రిపుల్ రైడింగ్ చేసినా, పరిమితికి మించి వేగంతో ప్రయాణించినా ఈ స్మార్ట్ కెమెరాలు వెంటనే పసిగడతాయి. ఇలా దాదాపు 14 రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలను ఈ ఏటీఎంఎస్ వ్యవస్థ గుర్తించగలదు. నిబంధనలు అతిక్రమించిన వాహనం వివరాలను వెంటనే ఎన్‌ఐసీ ఈ-చలాన్ పోర్టల్‌కు, సంబంధిత పోలీసు అధికారులకు చేరవేస్తుంది. దీంతో మానవ ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్‌గా చలాన్లు జారీ అవుతాయి.

టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది?

భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) మార్గదర్శకాలకు అనుగుణంగా ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ ఈ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేతో పాటు ఎన్‌హెచ్-48లోని 28 కిలోమీటర్ల మార్గంలో కలిపి మొత్తం 56.46 కిలోమీటర్ల పొడవునా ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ప్రతి కిలోమీటర్‌కు ఒకటి చొప్పున మొత్తం 110 హై-రిజల్యూషన్ పీటీజెడ్ కెమెరాలను అమర్చారు. ఇవి 24 గంటలూ రహదారిపై జరిగే ప్రతి కదలికను రికార్డు చేస్తాయి. ట్రాఫిక్ పర్యవేక్షణ, ప్రమాదాలను వీడియో తీయడం, వాహన వేగాన్ని గుర్తించడం, అవసరమైన సందేశాలను డిజిటల్ బోర్డులపై ప్రదర్శించడం, సెంట్రల్ కంట్రోల్ రూమ్ వంటివి ఈ వ్యవస్థలో ప్రధాన భాగాలు.

డిజిటల్ బ్రెయిన్‌లా పనిచేసే కంట్రోల్ రూమ్

ఈ మొత్తం వ్యవస్థకు కమాండ్ సెంటర్ ఒక 'డిజిటల్ బ్రెయిన్' లాగా పనిచేస్తుంది. రహదారిపై ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే స్థానిక సిబ్బందికి, జాతీయ రహదారి అధికారులకు సమాచారం అందిస్తుంది. అంతేకాకుండా, దట్టమైన పొగమంచు ఏర్పడినా, రోడ్డుపై ఏవైనా అడ్డంకులు ఉన్నా లేదా జంతువులు ప్రవేశించినా వెంటనే సంబంధిత సిబ్బందిని అప్రమత్తం చేసి తగిన చర్యలు తీసుకునేలా చేస్తుంది.



More Telugu News