అమెరికాలో భారత యువతి అదృశ్యం.. పెళ్లి కోసం వచ్చి గల్లంతు!

  • పెద్దలు కుదిర్చిన పెళ్లి కోసం అమెరికా వెళ్లిన యువతి
  • న్యూజెర్సీలో విమానం దిగిన తర్వాత కనిపించకుండా పోయిన వైనం
  • ఉచిత ప్రయాణం కోసమే పెళ్లి నాటకమనే అనుమానం
  • సీసీటీవీలో ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్లు గుర్తింపు
పెద్దలు కుదిర్చిన పెళ్లి కోసం భారత్ నుంచి అమెరికా వెళ్లిన ఓ యువతి అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. న్యూజెర్సీలో విమానం దిగిన కొద్దిసేపటికే ఆమె కనిపించకుండా పోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. 24 ఏళ్ల సిమ్రన్ అనే భారతీయ యువతి జూన్ 20న న్యూజెర్సీ చేరుకున్నారు. విమానం దిగిన తర్వాత సిమ్రన్ తన ఫోన్ చూస్తూ ఎవరి కోసమో ఎదురుచూస్తుండడం సీసీటీవీ ఫుటేజీలో కనిపించిందని అమెరికా పోలీసులు తెలిపారు. ఆ సమయంలో ఆమె ఎలాంటి ఆందోళనతో కనిపించలేదని స్పష్టం చేశారు. ఆమె అమెరికా వచ్చిన ఐదు రోజుల తర్వాత, అంటే బుధవారం నాడు అదృశ్యమైనట్లు కేసు నమోదైంది.

ప్రాథమిక విచారణలో సిమ్రన్ పెద్దలు కుదిర్చిన పెళ్లి కోసమే అమెరికా వచ్చినట్లు తేలిందని అధికారులు చెప్పారు. అయితే, కేవలం ఉచితంగా విమాన ప్రయాణం చేసేందుకే పెళ్లి నాటకం ఆడిందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిమ్రన్‌కు అమెరికాలో బంధువులెవరూ లేరని, ఆమెకు ఇంగ్లిష్ కూడా రాదని తెలిపారు. ఆమె వద్ద ఉన్న ఫోన్ కేవలం వైఫైతో మాత్రమే పనిచేస్తుండటంతో సంప్రదించడం కష్టంగా మారింది. భారత్‌లోని ఆమె కుటుంబ సభ్యుల వివరాలు కూడా లభించలేదని పోలీసులు తెలిపారు.

సిమ్రన్ ఐదు అడుగుల నాలుగు అంగుళాల పొడవు, సుమారు 68 కిలోల బరువు ఉంటారని పోలీసులు ఆమె గుర్తింపు వివరాలు విడుదల చేశారు. నుదుటికి ఎడమవైపు ఒక చిన్న మచ్చ ఉందని, చివరిసారిగా ఆమె గ్రే రంగు స్వెట్‌ప్యాంట్స్, తెల్ల టీ-షర్ట్ ధరించి ఉన్నారని వివరించారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు లిండెన్‌వోల్డ్ పోలీస్ డిటెక్టివ్ జో టొమాసెట్టికి సమాచారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.


More Telugu News