బుమ్రా అందుబాటులో ఉన్నాడు.. కానీ ఆడతాడా? రెండో టెస్టుపై వీడని ఉత్కంఠ!

  • ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు బుమ్రా అందుబాటులో ఉన్నాడ‌న్న అసిస్టెంట్ కోచ్‌
  • పనిభారం దృష్ట్యా తుది జట్టులో అతని ఎంపికపై ఇంకా నిర్ణయం తీసుకోలేద‌ని వ్యాఖ్య‌
  • ఈ సిరీస్‌లో బుమ్రా కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడతాడని వెల్లడి
  • సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్ గెలవడం భారత్‌కు చాలా కీలకం
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే 0-1తో వెనుకబడిన టీమిండియాకు కీలకమైన రెండో టెస్టుకు ముందు కాస్త ఊరట లభించింది. భారత ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఎంపికకు అందుబాటులో ఉన్నట్లు జట్టు సహాయక కోచ్ ర్యాన్ టెన్ డెస్కాటే సోమవారం స్పష్టం చేశాడు. అయితే, జులై 2 నుంచి ఎడ్జ్‌బాస్టన్‌లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో బుమ్రాను తుది జట్టులోకి తీసుకోవాలా? వద్దా? అనే విషయంపై టీమ్ మేనేజ్‌మెంట్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపాడు.

మొదటి టెస్టులో బుమ్రా ఏకంగా 43.4 ఓవర్లు బౌలింగ్ చేసి తీవ్రమైన పనిభారాన్ని మోశాడు. ఈ నేపథ్యంలో అతని భారాన్ని తగ్గించే వ్యూహంలో భాగంగానే మేనేజ్‌మెంట్ ఈ సిరీస్‌లో అతడిని కేవలం మూడు మ్యాచ్‌లకే పరిమితం చేయాలని భావిస్తోంది. దీనిపై ర్యాన్ టెన్ డెస్కాటే మాట్లాడుతూ... "బుమ్రా ఈ ఆటకు అందుబాటులో ఉన్నాడు. అతను ఐదింటిలో మూడు టెస్టులు మాత్రమే ఆడతాడని మాకు ముందే తెలుసు. గత టెస్టు తర్వాత కోలుకోవడానికి అతనికి ఎనిమిది రోజుల సమయం దొరికింది. అయినా, ఇక్కడి పరిస్థితులు, పనిభారం, రాబోయే మ్యాచ్‌లను దృష్టిలో ఉంచుకుని అతడిని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై మేం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు" అని వివరించాడు.

పనిభారమా? సిరీస్ గెలుపా?
బుమ్రాకు ఎలాంటి గాయాలు లేవని, అతను పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడని అసిస్టెంట్‌ కోచ్ స్పష్టం చేశాడు. ఇది కేవలం పనిభారం నిర్వహణకు సంబంధించిన వ్యూహాత్మక నిర్ణయం మాత్రమేనని తెలిపాడు. "బుమ్రా ఆడటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఈ నాలుగు టెస్టులను ఎలా ప్లాన్ చేసుకోవాలనేదే మా ముందున్న సవాలు. ఈ టెస్టులో అతడిని ఆడిస్తే ప్రయోజనం ఉంటుందని భావిస్తే, చివరి నిమిషంలోనైనా ఆ నిర్ణయం తీసుకుంటాం. పిచ్ ఎలా స్పందిస్తుంది? లార్డ్స్, మాంచెస్టర్ లేదా ఓవల్ టెస్టుల కోసం అతడిని కాపాడుకోవడం మంచిదా? అనే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాం" అని టెన్ డెస్కాటే అన్నాడు.

తాజాగా జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో బుమ్రా పూర్తిస్థాయిలో బౌలింగ్ చేయడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కీలకమైన రెండో టెస్టులో అతను ఆడటం ఖాయమని ఊహాగానాలు మొదలయ్యాయి.


More Telugu News