ఆ ఒక్క కోరిక అలా మిగిలిపోయింది: నిర్మాత కిశోర్ రాఠీ!

  • వరుస హిట్స్ ఇచ్చిన కిశోర్ రాఠీ 
  • ఆ తరువాత కనిపించని నిర్మాత
  • హంగులూ ఆర్భాటాలు నచ్చవని వెల్లడి 
  • అమితాబ్ తో సినిమా చేయాలనే కోరిక నెరవేరలేదనే నిరాశ   

 ఎస్వీ కృష్ణారెడ్డి .. అచ్చిరెడ్డి ఇద్దరూ కూడా దర్శక నిర్మాతలుగా వరుస హిట్స్ నమోదు చేస్తూ వెళ్లారు.  అయితే ఆరంభంలో ఆ ఇద్దరితో పాటు మరో పేరు కూడా కనిపించేది .. ఆ పేరే కిశోర్ రాఠీ. యమలీల .. మాయలోడు .. రాజేంద్రుడు - గజేంద్రుడు వంటి సినిమాలకు నిర్మాతగా మనకి ఆయన పేరు కూడా కనిపిస్తుంది. అలాంటి కిశోర్ రాఠీ, కెమెరా ముందుకు వచ్చి చాలాకాలమే అయింది. తాజాగా 'ఐ డ్రీమ్' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. 

" మొదటి నుంచి కూడా నాకు మీడియాలో కనిపించడం పెద్దగా ఇష్టం ఉండదు. హడావిడి .. ఆర్భాటం నాకు నచ్చదు. అందువలన నా పనిని నేను చేసుకుంటూ వెళుతుంటాను. సినిమాల వైపుకు రావడానికి ముందు నేను బిజినెస్ చేశాను .. ఇప్పుడు కూడా రెస్టారెంట్ బిజినెస్ చేస్తున్నాను. నేను సినిమాలు చేయడం లేదనే మాటే గానీ, ఎస్వీ కృష్ణారెడ్డి .. అచ్చిరెడ్డి .. అలీ .. ఇలా అప్పటి వాళ్లందరితోను టచ్ లోనే ఉంటూ ఉంటాను" అని అన్నారు. 

"నాకు చాలా బాధను కలిగించిన విషయాలలో సౌందర్య చనిపోవడం ఒకటి. ఆమె ఫాదర్ .. నేను మంచి స్నేహితులం. ఆ పరిచయంతోనే సౌందర్యను మా సినిమాలలోకి తీసుకోవడం జరిగింది. ఇక ఇప్పుడు సినిమా బిజినెస్ అనేది పూర్తిగా మారిపోయింది. బడ్జెట్ అనేది బాగా పెరిగిపోయింది. అందువలన ఆ వైపు గురించిన ఆలోచన చేయడం లేదు. అయితే నా ఫేవరేట్ స్టార్ అమితాబ్ తో ఒక సినిమా చేయాలని చాలా బలంగా ఉండేది. అది ఒక్కటి మాత్రం నెరవేరలేదు" అని చెప్పారు. 



More Telugu News