నన్ను చూస్తే ట్రంప్‌కు భయం.. అందుకే ఆ బెదిరింపులు: జోహ్రాన్ మందానీ

  • భారత సంతతి మేయర్ అభ్యర్థి జోహ్రాన్‌కు ట్రంప్ బహిష్కరణ హెచ్చరిక
  • ట్రంప్ బెదిరింపులపై అదే స్థాయిలో స్పందించిన జోహ్రాన్
  • ప్రజల దృష్టి మళ్లించడానికే నాపై దాడి అని ఆరోపణ
  • జోహ్రాన్‌ను 'కమ్యూనిస్ట్ లూనాటిక్' అని పేర్కొన్న ట్రంప్
  • డెమొక్రాటిక్ ప్రైమరీలో నెగ్గినప్పటి నుంచి ఆయ‌న‌పై రిపబ్లికన్ల విమర్శలు
అమెరికాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. న్యూయార్క్ నగర మేయర్ పదవికి పోటీ పడుతున్న భారత సంతతి అభ్యర్థి జోహ్రాన్ మందానీ (33)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన్ను అరెస్ట్ చేయాలని, దేశ పౌరసత్వాన్ని రద్దు చేసి బహిష్కరించాలని వ్యాఖ్యానించారు. ట్రంప్ బెదిరింపులపై జోహ్రాన్ అదే స్థాయిలో స్పందించారు. కార్మిక వర్గానికి తన ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని కప్పిపుచ్చుకోవడానికే ట్రంప్ ప్రజల మధ్య విభజన చిచ్చు పెడుతున్నారని, తనపై వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.

న్యూయార్క్‌లో జరిగిన ఒక ర్యాలీలో జోహ్రాన్‌ మందానీ మాట్లాడుతూ ట్రంప్ వ్యాఖ్యల వెనుక ఉన్న కారణాన్ని వివరించారు. "నన్ను అరెస్ట్ చేయాలని, దేశం నుంచి పంపించివేయాలని ట్రంప్ అన్నారు. కొన్ని తరాల తర్వాత ఈ నగరానికి మేయర్‌గా ఎన్నికయ్యే అవకాశం ఉన్న తొలి వలసదారుడిని, తొలి ముస్లిం, తొలి దక్షిణాసియా వాడిని కాబట్టే ఆయన నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. కానీ అసలు కారణం అది కాదు. 

నా నేపథ్యం, రూపం కంటే నేను ఎవరికోసం పోరాడుతున్నానో చూసి ఆయన భయపడుతున్నారు. నేను కార్మికులు, సామాన్య ప్రజల పక్షాన నిలబడతాను. ఆ విషయం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఆయన నాపై దాడి చేస్తున్నారు" అని తెలిపారు. రిపబ్లికన్ల బెదిరింపులకు భయపడబోమని, వెనక్కి తగ్గి పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

డెమొక్రాటిక్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో న్యూయార్క్ మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమోపై జోహ్రాన్ మందానీ అనూహ్యంగా గెలుపొందారు. అప్పటి నుంచి రిపబ్లికన్లు ఆయన్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. మందానీని ఒక 'తీవ్ర వామపక్షవాది'గా చిత్రీకరించి, నవంబర్‌లో జరగబోయే ఎన్నికల్లో ఓటర్లకు దూరం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ ఆయనపై పదేపదే మాట‌ల‌ దాడికి దిగుతున్నారు. 

జోహ్రాన్‌ను 'కమ్యూనిస్ట్ లూనాటిక్' (పిచ్చి కమ్యూనిస్ట్) అని అభివర్ణించిన ట్రంప్, ఆయన నుంచి న్యూయార్క్ నగరాన్ని తానే కాపాడతానని తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్'లో పోస్ట్ చేశారు. "అధ్యక్షుడిగా, ఈ కమ్యూనిస్ట్ లూనాటిక్ న్యూయార్క్‌ను నాశనం చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోను. నా దగ్గర అన్ని అధికారాలు ఉన్నాయి. న్యూయార్క్‌ను నేను కాపాడతాను" అని ట్రంప్ హెచ్చరించారు.

ట్రంప్ విమర్శలపై స్పందిస్తూ కార్మిక వర్గానికి ద్రోహం చేస్తున్న విషయాన్ని అంగీకరించలేకే ఆయన ఇలాంటి విభజన రాజకీయాలు చేస్తున్నారని మందానీ ఆరోపించారు. "అమెరికన్ల నుంచి వైద్య సంరక్షణను దూరం చేసే, పేదల కడుపు కొట్టే ఒక కీలకమైన బిల్లుపై గురువారం ఓటింగ్ జరగనుంది. ఆ బిల్లుపై చర్చ జరగకుండా, ప్రజల దృష్టిని మళ్లించేందుకే ట్రంప్ నా గురించి మాట్లాడుతున్నారు" అని మందానీ విమర్శించారు.


More Telugu News