నేను ఎవరినైనా చాలా అరుదుగానే ఫేవర్ అడుగుతాను: అర్జున్ దాస్ కు థ్యాంక్స్ చెప్పిన పవన్ కల్యాణ్

  • 'హరిహర వీరమల్లు' ట్రైలర్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చిన నటుడు అర్జున్ దాస్
  • పవన్ గారు అడగ్గానే వెంటనే ఒప్పుకున్నానని ట్విట్టర్‌లో వెల్లడి
  • అర్జున్ దాస్ ట్వీట్‌పై స్పందించిన పవన్ కల్యాణ్
  • నీ గొంతులో మ్యాజిక్, మెలోడీ ఉన్నాయంటూ ప్రశంసలు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం 'హరిహర వీరమల్లు' కోసం తమిళనటుడు అర్జున్ దాస్ తన గంభీరమైన గొంతును అందించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అర్జున్ దాస్ చేసిన ట్వీట్‌కు పవన్ కల్యాణ్ ఎంతో ఎమోషనల్ గా స్పందించారు. అర్జున్ దాస్ గొంతులో మ్యాజిక్, మెలోడీ ఉన్నాయంటూ ప్రశంసించారు.

వివరాల్లోకి వెళితే, 'హరిహర వీరమల్లు' సినిమా ట్రైలర్‌కు వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిందిగా పవన్ కల్యాణ్ తనను కోరినట్లు అర్జున్ దాస్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. "పవన్ కల్యాణ్ గారు తన సినిమా ట్రైలర్‌కు వాయిస్ ఇవ్వమని అడిగితే, ఎలాంటి ప్రశ్నలు అడగకుండా వెంటనే ఒప్పుకుంటాం. ఇది మీకోసమే సార్. మీకు, మీ చిత్ర బృందానికి శుభాకాంక్షలు" అంటూ అర్జున్ దాస్ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ పవన్ కల్యాణ్ స్పందించారు. "ప్రియమైన సోదరుడు అర్జున్ దాస్, నీకు నేను రుణపడి ఉంటాను. నేను ఎవరినైనా చాలా అరుదుగా సహాయం అడుగుతాను. నా అభ్యర్థనను మన్నించినందుకు ధన్యవాదాలు. నీ గొంతులో అద్భుతమైన మ్యాజిక్, మెలోడీ ఉన్నాయి" అంటూ అర్జున్ దాస్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. 


More Telugu News