బ్యాంక్ స్కామ్ కేసు.. ఈడీ విచారణ ఎదుర్కొన్న నిర్మాత అల్లు అరవింద్

  • బ్యాంకు స్కామ్ కేసులో నిర్మాత అల్లు అరవింద్‌కు ఈడీ నోటీసులు
  • సుమారు మూడు గంటల పాటు అల్లు అరవింద్‌ను ప్రశ్నించిన అధికారులు
  • 2018-19 మధ్య జరిగిన బ్యాంకు లావాదేవీలపై ప్రధానంగా ఆరా
  • వచ్చే వారం మరోసారి విచారణకు హాజరుకావాలని ఆదేశం
తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం రేగింది. ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విచారించారు. హైదరాబాద్‌కు చెందిన రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ సంస్థకు సంబంధించిన రూ.101 కోట్ల బ్యాంక్ రుణ మోసం కేసులో ఆయనను సుమారు మూడు గంటల పాటు ప్రశ్నించి, వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ఈ పరిణామం టాలీవుడ్‌ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళితే, రామకృష్ణ ఎలక్ట్రానిక్స్, రామకృష్ణ టెలిట్రానిక్స్ సంస్థలు 2017-19 మధ్యకాలంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.101 కోట్ల రుణం తీసుకుని ఎగవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ రుణ నిధులను సంస్థ యజమానులు సొంత ప్రయోజనాలకు, అక్రమ నగదు బదిలీకి వాడారని ఈడీ గుర్తించింది. మొదట సీబీఐ కేసు నమోదు చేయగా, ఆ తర్వాత మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.

ఈ దర్యాప్తులో భాగంగా రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ సంస్థతో అల్లు అరవింద్‌కు చెందిన సంస్థలకు మధ్య కొన్ని అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ లావాదేవీలపై స్పష్టత కోరుతూ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి హాజరైన అల్లు అరవింద్‌ను అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ప్రధానంగా బ్యాంకు లావాదేవీలు, ఆస్తుల కొనుగోళ్లకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.

విచారణ ఇంకా పూర్తికానందున, వచ్చే వారం మరోసారి తమ ఎదుట హాజరుకావాలని ఈడీ అధికారులు ఆయనకు సూచించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రామకృష్ణ గ్రూప్ యజమానులు వి. రాఘవేంద్ర, వి. రవి కుమార్‌లతో అల్లు అరవింద్‌కు ఉన్న సంబంధాలపై కూడా ఈడీ ఆరా తీస్తోంది.


More Telugu News