విజయానికి 7 వికెట్ల దూరంలో భారత్... ఎడ్జ్ బాస్టన్ లో కుండపోత వర్షం

  • భారత్-ఇంగ్లండ్ రెండో టెస్టుపై వర్షం తీవ్ర ప్రభావం
  • ఐదో రోజు ఆట ప్రారంభం ఆలస్యానికి కారణమైన వాన
  • విజయానికి కేవలం 7 వికెట్ల దూరంలో నిలిచిన భారత్
  • ఇంగ్లండ్ ముందు 608 పరుగుల కొండంత లక్ష్యం
  • రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అదరగొట్టిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్
  • నాలుగో రోజు ఆట ముగిసేసరికి ఇంగ్లండ్ స్కోరు 72/3
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో చారిత్రక విజయం ముంగిట నిలిచిన భారత జట్టు ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేయాలంటే చివరి రోజు భారత్‌కు ఏడు వికెట్లు అవసరం కాగా, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ఐదో రోజు ఆట ప్రారంభానికి తీవ్ర అంతరాయం కలిగించింది. దీంతో ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

ఆదివారం ఆట ప్రారంభం కావాల్సిన సమయానికి బర్మింగ్‌హామ్‌లో భారీ వర్షం మొదలైంది. యుకె వాతావరణ శాఖ అంచనాలకు తగ్గట్టే కుండపోతగా వర్షం కురవడంతో మైదానం చెరువును తలపించింది. పిచ్‌తో పాటు మైదానం మొత్తాన్ని కవర్లతో కప్పి ఉంచారు. వర్షం కారణంగా తొలి సెషన్ ఆట తుడిచిపెట్టుకుపోయే సూచనలు కనిపిస్తుండటంతో, ఫలితం తేల్చేందుకు భారత్‌కు తగినంత సమయం దొరుకుతుందా లేదా అన్నది సందేహంగా మారింది.

అంతకుముందు, ఈ మ్యాచ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత ప్రదర్శనతో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో కెరీర్ బెస్ట్ స్కోరు 269 పరుగులు చేసిన గిల్, రెండో ఇన్నింగ్స్‌లోనూ 161 పరుగులతో చెలరేగాడు. ఒకే టెస్టులో 200, 150 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా గిల్ అరుదైన రికార్డు సృష్టించాడు. దీంతో భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 427/6 వద్ద డిక్లేర్ చేసి, ఇంగ్లండ్ ముందు 608 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

కొండంత లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు భారత బౌలర్లు ఆకాశ్ దీప్, మహమ్మద్ సిరాజ్ ఆరంభంలోనే షాకిచ్చారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 72 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం ఓలీ పోప్ (24), హ్యారీ బ్రూక్ (15) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ గెలవాలంటే ఇంకా 536 పరుగులు చేయాల్సి ఉండగా, వర్షం కారణంగా ఆట ఆలస్యం కావడంతో వారు డ్రా కోసం ప్రయత్నించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.


More Telugu News