సిటాడెల్: 'హనీ బన్నీ' (అమెజాన్ ప్రైమ్) వెబ్ సిరీస్ రివ్యూ!

Movie Name: Citadel Honey Bunny

Release Date: 2024-11-07
Cast: Varun Dhavan, Samantha, kashvi Majmundar, Kay Kay Menon, Sikindar Kher, Simran
Director: Raj - DK
Producer: Syed Zaid Ali - Alec Conic
Music: Sachin - Jigar
Banner: Amazon MGM Studios - Gozie AGBO
Rating: 3.00 out of 5
  • స్పై యాక్షన్ జోనర్లో 'సిటాడెల్ హనీ బన్నీ'
  • కథకి తగిన భారీతనం ప్రత్యేక ఆకర్షణ 
  • ఆసక్తికరమైన కథాకథనాలు 
  • ఆకట్టుకునే యాక్షన్ - ఎమోషన్ 
  • సమంత - బేబీ కశ్వి నటన హైలైట్ 
   

ఫ్యామిలీ మేన్' ... ' ఫర్జీ' వంటి భారీ వెబ్ సిరీస్ లను అందించిన రాజ్ - డీకే, 'సిటాడెల్: హనీ బన్నీ' వెబ్ సిరీస్ ను నిర్మించారు. సమంత - వరుణ్ ధావన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్, అమెజాన్ ఫ్లాట్ ఫామ్ పై ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. 6 ఎపిసోడ్స్ గా ఈ సిరీస్ ను అందించారు. స్పై యాక్షన్ జోనర్లో రూపొందిన ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: ఈ కథ 1992- 2000కి మధ్య నడుస్తూ ఉంటుంది. కథలో ఎక్కువ భాగం ముంబై - నైనిటాల్ నేపథ్యంలో కొనసాగుతూ ఉంటుంది. హనీ (సమంత) సినిమాల్లో నటించాలనే ఆశతో ఇంట్లో నుంచి పారిపోయి ముంబైకి చేరుకుంటుంది. అయితే అక్కడి వాతావరణంలో ఆమె ఇమడలేకపోతుంది. సినిమాల్లో స్టంట్ మాస్టర్ గా పనిచేసే బన్నీతో ఆమెకి పరిచయం ఏర్పడుతుంది. అది కాస్తా ప్రేమగా మారుతుంది. ఒక వైపున స్టంట్ మాస్టర్ గా పనిచేసే అతను, మరో వైపున బాబా (కేకే మీనన్) నిర్వహించే ఒక సీక్రెట్ ఏజెన్సీ లో ఏజెంట్ 'రాహి' పేరుతో పనిచేస్తూ ఉంటాడు.

'రాహి' ఒక అనాథ. చిన్నప్పటి నుంచి అతను ఒక అనాథగా పెరుగుతాడు. బాబా అతని బాగోగులు చూస్తూ వస్తాడు. అందువలన బాబాను అతను ఒక తండ్రిలా భావిస్తూ ఉంటాడు. అతని కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా .. తీయడానికైనా సిద్ధపడే స్థాయిలో ప్రేమాభిమానాలు పెంచుకుంటాడు. జమీందారీ కుటుంబంలో పుట్టిపెరిగినప్పటికీ, సినిమాలపై ఇష్టంతో పారిపోయిన వచ్చిన హనీ, ఇప్పుడు 'రాహి'కి దగ్గరవుతుంది.   

చిన్నప్పటి నుంచి తాను ధైర్యవంతురాలినేననీ, తనని కూడా ఒక ఏజెంటుగా చేర్చుకోమని బన్నీని హనీ అడుగుతుంది. ఆమెకి పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చిన బన్నీ, ఆమె మనసులోని మాటను బాబాకి చెబుతాడు. హనీ తెలివితేటలపై .. ధైర్య సాహసాలపై తనకి నమ్మకం ఉందని బాబాతో అంటాడు.  ఏజెంటుగా ఆమెను చేర్చుకోవడానికి బాబా అయిష్టంగానే అంగీకరిస్తాడు. అప్పటి నుంచి హనీ ఆ టీమ్ తో కలిసి ఆపరేషన్స్ లో పాల్గొనడం మొదలెడుతుంది.

 అలాంటి పరిస్థితుల్లోనే 'ఆపరేషన్ తల్వార్' అనే మిషన్ ను 'సిటాడెల్' తెరపైకి తెస్తుంది. బాబా ఆ సంస్థను శత్రువుగా భావిస్తూ ఉంటాడు. ఆ మిషన్ ను పూర్తి కాకుండా ఆపాలనీ, ఆ మిషన్ కి సంబంధించిన 'వెపన్స్ ప్రోగ్రామ్'ను తాను దక్కించుకోవాలని భావిస్తాడు. అందుకోసం రాహి - హనీని రంగంలోకి దింపుతాడు. 'వెపన్స్ ప్రోగ్రామ్' ను డాక్టర్ రఘు (తలైవాసల్ విజయ్) నుంచి కాజేయడం కోసం అతనితో హనీ పరిచయం పెంచుకుంటుంది. 

రఘు మంచితనం .. సమాజం పట్ల అతనికి గల బాధ్యతను గ్రహించిన హనీ, అతని నుంచి 'వెపన్స్ ప్రోగ్రామ్'ను కాజేయడానికి తాను సిద్ధమనీ, అయితే అతని ప్రాణాలకు హాని తలపెట్టొదని రాహిని కోరుతుంది. గర్భవతి అయిన ఆమెకు రాహి మాట ఇస్తాడు. కానీ బాబా ఆదేశం మేరకు డాక్టర్ రఘును అతను చంపేస్తాడు. దాంతో ఆ 'వెపన్స్ ప్రోగ్రామ్'ను తీసుకుని హనీ పారిపోతుంది. ఆ సమయంలో జరిగిన ప్రమాదంలో ఆమె చనిపోయి ఉంటుందని రాహి అనుకుంటాడు. 

హనీని వెదకడానికి నకుల్ - కేడీ అనే ఇద్దరు అనుచరులను బాబా నియమిస్తాడు. వాళ్లు హనీని గాలించడం మొదలుపెడతారు. ఆమె ఓ కూతురుకు జన్మనిచ్చిందని తెలుసుకుంటారు. రాహికి తెలియకుండా ఆ ఇద్దరినీ లేపేయడానికి ప్లాన్ చేస్తారు. ఫలితంగా హనీ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? ఆ ప్రమాదం హనీతో పాటు ఆమె కూతురూను ఎలా వెంటాడుతుంది? అనేది మిగతా కథ.                     

విశ్లేషణ: 6 ఎపిసోడ్స్ గా దర్శకులు ఈ సిరీస్ ను అందించారు. ఈ ఎపిసోడ్స్ అన్నీ కూడా యాక్షన్ - ఎమోషన్ ప్రధానంగా సాగుతాయి. బలమైన స్క్రీన్ ప్లే కారణంగా సిరీస్ మొదటి నుంచి చివరి వరకూ ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. భారీతనం కథకు మరింత బలాన్ని చేకూర్చింది. యాక్షన్ ఎపిసోడ్స్ ను డిజైన్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. తన కూతురు కాపాడుకోవడం కోసం హనీ పడే ఆరాటం .. అందుకోసం చేసే పోరాటం మెప్పిస్తుంది. ఛేజింగులు .. ఫైరింగులు ఉత్కంఠను పెంచుతాయి. 

దర్శకులు అటు 1992లో .. ఇటు 2000లలో జరిగిన కథను సమాంతరంగా చూపిస్తూ వెళుతుంటారు. ఈ స్క్రీన్ ప్లే కొత్తగా అనిపిస్తుంది .. కాకపోతే స్క్రీన్ పై వేసే 'సీజీ' మిస్సయితే మాత్రం కాస్త కన్ఫ్యూజన్ వస్తుంది. కథ అంతా బాగానే ఉంది .. కాకపోతే 'ఆపరేషన్ తల్వార్' విషయంలో ఇంకాస్త క్లారిటీ ఇస్తే బాగుండేదేమో అనిపిస్తుంది. అలాగే సిమ్రాన్ పాత్రను ఇంకాస్త పవర్ఫుల్ గా మలిస్తే బెటర్ గా ఉండేదేమో అనిపిస్తుంది. 

 పనితీరు: వరుణ్ ధావన్ ఉన్నప్పటికీ .. ఇది సమంత సిరీస్ అని చెప్పొచ్చు. ఆమె నటన ఈ సిరీస్ కి హైలైట్. యాక్షన్ దృశ్యాలలో వరుణ్ కూడా బాగా చేశాడు. ఇక సమంత కూతురు పాత్రలో చేసిన కశ్వి మజ్ ముందర్ కి మంచి మార్కులు పడతాయి. సహజమైన నటనతో ఈ పాప ఆకట్టుకుంటుంది. ఇక కేకే మీనన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు.

జాన్ కెమెరా పనితనం బాగుంది. యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించిన విధానం మెప్పిస్తుంది. సచిన్ - జిగర్ నేపథ్య సంగీతం ఈ సిరీస్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళుతుంది. సుమిత్ ఎడిటింగ్ ఆకట్టుకుంటుంది. ఒక్కో ఎపిసోడ్ నిడివి 42 నిమిషాల నుంచి 55 నిమిషాల వరకూ ఉంటుంది. అందువలన అక్కడక్కడా కాస్త స్లోగా అనిపించినప్పటికీ, కంటెంట్ పరంగా కనెక్ట్ అయ్యే సిరీస్ గానే చెప్పుకోవచ్చు. 

Trailer

More Movie Reviews