'పొట్టేల్' (ఆహా) మూవీ రివ్యూ!

Movie Name: Pottel

Release Date: 2024-12-20
Cast: Yuvachandra, Ananya Nagalla, Ajay, Chatrapathi Sekhar
Director: Sahith Mothkuri
Producer: Nishank Reddy- Suresh Kumar
Music: Sekhar Chandra
Banner: Pragnya Sannidhi Creations
Rating: 2.75 out of 5
  • గ్రామీణ నేపథ్యంలో సాగే 'పొట్టేల్'
  • అక్టోబర్లో థియేటర్లకు వచ్చిన సినిమా
  • కథ - స్క్రీన్ ప్లే - నేపథ్య సంగీతం ప్రధాన బలం  
  • ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే కంటెంట్
         

అజయ్ - అనన్య నాగళ్ల - యువచంద్ర ప్రధానమైన పాత్రలను పోషించిన సినిమా 'పొట్టేల్'. టైటిల్ తోనే ఆకట్టుకున్న ఈ సినిమా, అక్టోబర్ 25వ తేదీన థియేటర్లకు వచ్చింది. సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, శేఖర్ చంద్ర సంగీతాన్ని అందించాడు. అలాంటి ఈ సినిమా నిన్నటి నుంచి అమెజాన్ ప్రైమ్ - ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పైకి వచ్చింది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.

కథ: ఈ కథ 1970లలో మొదలవుతుంది. అది ఒక మారుమూల గ్రామం. ఆ గ్రామంపై పటేల్ కుటుంబం పెత్తనం చేస్తూ ఉంటుంది. గ్రామస్తులు చదువుకుంటే తమని ప్రశ్నించే తెలివితేటలు వస్తాయని భావించిన పటేల్ కుటుంబం, ఆ ఊరువారిని చదువుకు దూరం పెడుతుంది. అయితే చదువు విలువను అర్థం చేసుకున్న మల్లన్న (ఛత్రపతి శేఖర్) తన కొడుకు గంగాధరం (యువచంద్ర)ను చదివించాలనుకుంటాడు. ఆ ఆలోచన రాగానే అతణ్ణి పటేల్ (అజయ్) చంపేస్తాడు.

ఆ గ్రామస్తులు చదువుకోవడానికి వీల్లేదని తాను చెబితే వ్యతిరేకత వస్తుందని భావించిన పటేల్, వాళ్లంతా గ్రామదేవతగా ఆరాధించే 'బాలమ్మ' మాటగా చెబుతాడు. అతణ్ణి ఎదిరించలేక .. గ్రామస్తులకు నిజం చెప్పలేక ఆ నిస్సహాయతతోనే గంగాధరం పెద్దవాడవుతాడు. అదే గ్రామానికి చెందిన బుజ్జమ్మ (అనన్య నాగళ్ల) అతణ్ణి ఇష్టపడుతూ ఉంటుంది. బుజ్జమ్మ అన్నయ్యను ఎదిరించి మరీ ఆమెను గంగాధరం పెళ్లి చేసుకుంటాడు. 

ఇక గ్రామదేవతకి 12 ఏళ్లకి ఒకసారి 'పొట్టేలు'ను బలి ఇవ్వడం ఆచారంగా వస్తూ ఉంటుంది. గతంలో 'బలి' కార్యక్రమం జరగకపోవడం వల్లనే, తమ గ్రామంలో వరుస మరణాలు సంభవిస్తున్నాయని నమ్ముతుంటారు. ఈ సారి బలి ఇవ్వాల్సిన పొట్టేలు సంరక్షణ బాధ్యత గంగాధరంపై ఉంటుంది. ఏ కారణంగానైనా పొట్టేలును బలి ఇవ్వలేకపోతే, సంరక్షకుడిగా ఉన్నవారు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది.

గంగాధరం ముందు రెండే ముఖ్యమైన అంశాలు ఉంటాయి. తాను చదువుకోకపోవడం వలన ఎంతో నష్టపోయాడు. అందువలన తన కూతురును చదివించాలి. గ్రామస్తులను చైతన్యవంతులను చేసి పటేల్ అక్రమాల నుంచి వారిని బయటపడేయాలి. ఇక రెండోది .. పొట్టేల్ బలి కార్యక్రమం సక్రమంగా సాగేలా చేయాలి. గ్రామస్తులు చదువుకోవడానికి ఎంత మాత్రం ఇష్టపడని పటేల్ ఏం చేస్తాడు? ఫలితంగా గంగాధరం కుటుంబం ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది కథ. 

విశ్లేషణ: 1970లలో గ్రామాలలో ఉండే వెనుకబాటుతనం .. మూఢ నమ్మకాలను దర్శకుడు ప్రధానమైన కథావస్తువుగా తీసుకున్నాడు. అప్పట్లో గ్రామస్థాయిలో పెత్తనం పటేళ్ల కుటుంబాలు  చేస్తూ ఉండేవి. వాళ్ల కనుసన్నలలోనే తక్కువ వర్ణాల వారు నడుచుకుంటూ ఉండేవారు. చదువుకుంటే వాళ్లు చైతన్యవంతులవుతారని భావించిన పటేళ్లు, ఆ చదువుకు వాళ్లను దూరంగా ఉంచేవారు. అలాంటి ఒక సమస్యను ప్రధానంగా చేసుకుని దర్శకుడు ఈ కథను తెరపైకి తీసుకుని వచ్చాడు. 

గ్రామాల్లో అప్పట్లో జంతుబలులు ఎక్కువగా జరిగేవి. అమ్మవారు పూని, తనకి కావలసినవి అడుగుతుందని విశ్వసించేవారు. వారిలోని ఈ బలహీనతను పెత్తందారులు తమకి అనుకూలంగా మార్చుకునేవారు. ఈ విషయాన్ని కూడా మరో వైపు నుంచి దర్శకుడు అల్లుకుంటూ వచ్చాడు. మొత్తానికి తాను చెప్పదలచుకున్న విషయాన్ని క్లారిటీతో చెప్పాడు.

ఈ కథలో గ్రామం కూడా ప్రధానమైన పాత్రను పోషించిందని చెప్పాలి. అలా గ్రామస్తులను కథలో భాగం చేసిన విధానం బాగుంది. అలాగే గ్రామీణ నేపథ్యంలోని లొకేషన్స్ ఈ కథకి మరింత బలాన్ని చేకూర్చాయి. పాత్రలను మలచిన విధానం .. సన్నివేశాలను ఆవిష్కరించిన తీరు ఈ సినిమాను సహజత్వానికి దగ్గరగా తీసుకుని వెళ్లాయి. మనిషిలోని అజ్ఞానానికి విరుగుడు అక్షరమే అంటూ ఇచ్చిన సందేశం ఆడియన్స్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది.

పనితీరు: ఒక గ్రామం .. తన బాగుకోసం ఆలోచించే ప్రతినాయకుడు .. ఊరు బాగు కోసం ప్రయత్నించే కథానాయకుడు. ఎవరు అనుకున్నది సాధించడానికి వారు చేసే పోరాటమే ఈ కథ. దీనిని స్పష్టంగా చెప్పడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కథానాయకుడిగా యువచంద్ర .. ప్రతినాయకుడిగా అజయ్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అనన్య నాగళ్లతో పాటు మిగతా వారంతా పాత్రల పరిధిలో మెప్పించారు. 

మోనిష్ భూపతిరాజు కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. విలేజ్ నేపథ్యం .. ఫారెస్టు నేపథ్యం .. జలపాతం నేపథ్యంలోని సన్నివేశాలను చిత్రీకరించిన తీరు బాగుంది. శేఖర్ చంద్ర బాణీలు .. నేపథ్య సంగీతం సందర్భానికి తగినట్టుగా సాగాయి. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ కూడా నీట్ గా అనిపిస్తుంది. 1970లలో కొన్ని మారుమూల గ్రామాలలోని పరిస్థితుల పట్ల అవగాహన ఉన్నవారికీ, తెలుసుకోవాలనుకునేవారికి ఈ కంటెంట్ నచ్చుతుంది. 

Trailer

More Movie Reviews