'బ్లడీ బెగ్గర్' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

Movie Name: Bloody Beggar

Release Date: 2025-01-02
Cast: Kavin, Radha Ravi, Redin Kingsley, Pruthvi Raj, Saleema
Director: Sivabalan Muthukumar
Producer: Nelson
Music: Jen Martin
Banner: Filament Pictures
Rating: 2.50 out of 5
  • తమిళంలో రూపొందిన 'బ్లడీ బెగ్గర్'
  • క్రితం ఏడాది అక్టోబర్లో విడుదలైన సినిమా 
  • నిన్నటి నుంచి తెలుగులో అందుబాటులోకి
  • విలాసవంతమైన ఒక ప్యాలెస్ చుట్టూ తిరిగే కథ ఇది  సరదాగా సాగిపోయే కంటెంట్

'బ్లడీ బెగ్గర్' .. తమిళంలో బ్లాక్ కామెడీ డ్రామా జోనర్లో నిర్మితమైన సినిమా. క్రితం ఏడాది అక్టోబర్ 31వ తేదీన థియేటర్లకు వచ్చింది. చాలా తక్కువ బడ్జెట్ లో రూపొందిన ఈ సినిమా, 11 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. నవంబర్ 29 నుంచి తమిళంలో ఈ సినిమా స్ట్రీమింగుకి వచ్చింది. నిన్నటి నుంచే తెలుగులోను అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: ఓ బిచ్చగాడు (కవిన్) ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అడుక్కుంటూ ఉంటాడు. కాళ్లు చేతులు సక్రమంగానే ఉన్నప్పటికీ, అబద్ధాలు చెబుతూ భిక్షాటన చేస్తూ ఉంటాడు. రుచికరమైన భోజనం చేయడమంటే అతనికి చాలా ఇష్టం. ఆ రోజుకి అలా తినడానికి అవసరమైన డబ్బులు వస్తే చాలని అనుకుంటూ ఉంటాడు. ఓ గొప్పింటి వ్యక్తి చనిపోవడంతో, అనాథలకు అన్నదానం జరుగుతుందని తెలిసి అక్కడికి వెళతాడు. 

ఆ శ్రీమంతుడి బంగ్లా చూసిన బిచ్చగాడు ఆశ్చర్యపోతాడు. అక్కడ అన్నం తినేసి రహస్యంగా ఆ బంగ్లాలోకి ప్రవేశిస్తాడు. అతను లోపలికి వెళ్లాడనే విషయం తెలియక బయట నుంచి తలుపులు వేసేస్తారు. దాంట్లో అతను లోపల చిక్కుబడతాడు. ఆ బంగ్లాలో ఒక అందమైన యువతి ఉండటం చూసి షాక్ అవుతాడు. ఆమె ఒక డెడ్ బాడీని ముక్కలుగా నరుకుతూ ఉండటం చూసి, భయంతో పారిపోవడానికి ప్రయత్నించి పట్టుబడతాడు. 

చనిపోయిన శ్రీమంతుడు చంద్రబోస్ (రాధారవి) అనే ఒక పేరున్న నటుడు. ఆయనకి ఇద్దరు కొడుకులు .. ఇద్దరు కూతుళ్లు. ఆయన మొత్తం ఆస్తి 300 కోట్లు. ఆ నలుగురికీ కలిపి ఆయన కోటి రూపాయలు మాత్రమే ఇస్తున్నట్టుగా వీలునామా రాస్తాడు. మిగతాది లేటు వయసులో మరో భార్యకి పుట్టిన బిడ్డకి రాస్తాడు. చంద్రబోస్ వారసులు వస్తున్నారనీ, అతనికి లేటు వయసులో పుట్టిన బిడ్డగా నటించమని ఆ యువతి బిచ్చగాడిని కోరుతుంది. అప్పుడు అతను ఏమంటాడు? ఫలితంగా ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేస్తాడు? అనేది కథ. 

విశ్లేషణ
: శివబాలన్ ముత్తుకుమార్ ఈ సినిమాకి కథను అందించాడు. ఒక బిచ్చగాడు విలాసవంతమైన ఒక ప్యాలెస్ లోకి రహస్యంగా ప్రవేశిస్తాడు. అందులో ఎవరూ ఉండటం లేదని అతను అనుకుంటాడు. కానీ ఆ ఆస్తికోసం వారసుల మధ్య పెద్ద గొడవ జరుగుతుందనే విషయం అతనికి తెలియదు. వారసుల మధ్య సఖ్యత లేకపోవడం వలన, ఆ ఆస్తిని కాజేయడానికి మరో వర్గం ట్రై చేస్తూ ఉంటుంది. ఆస్తిని కొట్టేయడానికి వాళ్లు ఈ బిచ్చగాడిని ఓ పావులా ఉపయోగించుకోవాలనుకోవడంతో అసలు కథ మొదలవుతుంది.

 దర్శకుడు కామెడీని .. ఎమోషన్స్ ను కలిపి ఈ కథను నడిపించాడు. బిచ్చగాడి బాల్యానికి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ .. యవ్వనానికి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి. ఇక అతను ప్యాలెస్ లోకి ఎంటరైన దగ్గర నుంచి కామెడీ తోడవుతుంది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. కథలో 90 శాతం ప్యాలెస్ లోనే జరుగుతుంది. దాగుడు మూతలు తరహాలో లోపల గోడల మధ్య జరిగే ఫన్ సరదాగా అనిపిస్తుంది. 

ఏ రోజుకు ఆ రోజు ఆకలి తీరేంత డబ్బులు వస్తే చాలనుకునే బిచ్చగాడు ఒక వైపు. వందల కోట్ల ఆస్తుల కోసం కొట్లాడుకునే వారసులు ఒక వైపు అనేట్టుగా ఈ కథ నడుస్తుంది. కుటుంబం .. బంధాలు అనే విషయానికి సంబంధించిన సన్నివేశాలు, ఎవరు బిచ్చగాళ్లు? అనే ఒక ఆలోచనను రేకెత్తిస్తాయి. అసలు ఈ బిచ్చగాడు ఎవరు? అతని ఫ్లాష్ బ్యాక్ ఏమిటి? కథకి గల ముగింపు అనేవి ఈ కథ బలాన్ని మరింత పెంచుతాయి. 

పనితీరు: నిర్మాణం పరంగా చూసుకుంటే, ఈ కథ అంతా కూడా  ఒక ప్యాలెస్ లో జరుగుతుంది. అందువలన ఓ మాదిరి బడ్జెట్ లోనే ఈ కథ కనిపిస్తుంది. దర్శకుడు కథను అల్లుకున్న తీరు ..  కంటెంట్ ను తెరపై ఆవిష్కరించిన విధానంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఒక వైపున కథను సీరియస్ గా నడిపిస్తూనే, మరో వైపున కామెడీ టచ్ ఇచ్చిన పద్ధతి బాగుంది.

ఇక ఆర్టిస్టుల విషయానికి వస్తే, ఎవరికి వారు తమ పాత్రలకు న్యాయం చేశారు. విలాసవంతమైన జీవితం కోసం ఆశపడుతూ, అందుకోసం ఏం చేయడానికైనా తెగించే పాత్రలను పోషించిన ఆర్టిస్టులు, చాలా సహజంగా నటించారు. సుజిత్ సారంగ్ ఫొటోగ్రఫీ బాగుంది. జెన్ మార్టిన్ నేపథ్య సంగీతం సందర్భానికి తగినట్టుగా సాగుతుంది. నిర్మల్ ఎడిటింగ్ ఓకే. ఎలాంటి అభ్యంతరకరమైన సన్నివేశాలు లేని ఈ సినిమాను సరదాగా చూడొచ్చు.

Trailer

More Movie Reviews