సేఫ్టీ క్లబ్ లను ప్రారంభించిన బ్రిటీష్ హైకమిషనర్ ఫ్లెమింగ్

రాష్ట్రంలో మహిళలు, యువతుల భద్రతకై పోలీస్ శాఖ మరో వినూత్న కార్యక్రమాన్ని నేడు ప్రారంభించింది. కళాశాలల్లో కనీసం 45 మంది విద్యార్థినులు సభ్యులుగా వుండే సేఫ్టీ క్లబ్ లను నేడు లాంఛనంగా హైదరాబాద్ లోని ఐదు కళాశాలల్లో మహిళా భద్రతా విభాగం ప్రారంభించింది. సికిందరాబాద్ ఎస్.వీ.ఐ.టీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో బ్రిటీష్  డిప్యూటీ హైకమిషనర్ డా. అండ్రు ఫ్లెమింగ్ ముఖ్య అతిధిగా పాల్గొని సేఫ్టీ క్లబ్ లను మహిళా భద్రతా విభాగం ఐజీ స్వాతీ లక్రా, ఎస్.పీ. సుమతి లతో కలసి ప్రారంభించారు.

ఈ సందర్బంగా బ్రిటీష్ డిప్యూటీ హై- కమీషనర్ ఆండ్రు ఫ్లెమింగ్ మాట్లాడుతూ తెలంగాణాలో మహిళలు, యువతుల భద్రత, రక్షణకు చేపట్టిన చర్యలు వినూత్నంగా ఉందని, వీటితో భద్రత పై మహిళల్లో సరికొత్త భరోసా ఏర్పడిందని ప్రశంసించారు. తాజాగా మహిళల భద్రత కై సేఫ్టీ క్లబ్ లను తీసుకురావడం సంతోషకరమైన విషయమని అన్నారు. ఈ సేఫ్టీ క్లబ్ లను కేవలం తెలంగాణా నే కాకుండా దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టాలని సూచించారు. మహిళల భద్రతకై ప్రవేశపెట్టిన హాక్-ఐ, డయల్100, షీటీమ్స్, సేఫ్టీ క్లబ్ తదితర ఇనీషియేటివ్ లపై విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు.

మహిళా భద్రతా విభాగం ఐ.జీ స్వాతీ లక్రా మాట్లాడుతూ సమాజంలో కేవలం పది నుండి పదిహేను శాతం యువకుల ప్రవర్తనలోనే మార్పు తేవాల్సిన అవసరం ఉందని, దాదాపు 80 శాతానికి పైన యువకులు సత్ప్రవర్తనతో వున్నారని అభిప్రాయపడ్డారు. ప్రతీ కళాశాలలో 45 మంది విద్యార్థినులు సభ్యులుగా వుండే ఈ సేఫ్టీ  క్లబ్ లు గర్ల్ స్టుడెంట్స్ భద్రతతో పాటు, తమ చుట్టూ ఉన్నమహిళల రక్షణ కోసం పనిచేస్తారని అన్నారు. ఈ సేఫ్టీ క్లబ్ లను త్వరలోనే రాష్ట్రం అంతటికీ విస్తరిస్తామని పేర్కొన్నారు. షీ-టీమ్స్, విమేన్ సేఫ్టీ వింగ్ లు ఎప్పుడూ మహిళల భద్రతే ప్రధాన ద్యేయంగా పనిచేస్తాయని స్వాతీ లక్రా స్పష్టంచేశారు. ప్రతి ఒక్క మహిళ, స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ విద్యార్థినీ విధిగా హాక్-ఐ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. కళాశాల విర్ద్యార్దినులు పెద్ద సంఖ్యలో హాజరైన ఈ కార్యక్రమంలో మహిళల భద్రత, రక్షణ పై రూపొందించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఆలోచింపచేశాయి. ఈ కార్య్రక్రమంలో ఎస్.సి.ఈ.ఆర్.టీ. డైరెక్టర్ టీ.శేషుకుమారి, కళాశాల విద్య జాయింట్ డైరెక్టర్ మంగళ, పలు స్వచ్ఛంద సంస్థలకు చెందిన అజయ్ సింగ్,  వికార్ ఘావ, మధుసూదన్ రావు, సబ్రియా తదితరులు హజరయ్యారు. 


More Press News