పల్లెప్రగతి, పట్టణ ప్రగతిలో పచ్చదనం పెంచేందుకు పాటుపడదాం: పీసీసీఎఫ్

>>అడవుల రక్షణ, పునరుజ్జీవన చర్యలు, అర్బన్ ఫారెస్ట్ పార్కుల ఏర్పాటుకు కార్యాచరణ

>>వరంగల్, కరీంనగర్ అటవీ సర్కిళ్ల సమీక్షా సమావేశంలో పీసీసీఎఫ్

పచ్చదనం పెంపు, అడవుల పునరుద్దరణపై కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు అటవీ శాఖ అధికారులు కార్యాచరణ మొదలు పెట్టారు.

పీసీసీఎఫ్ తో సహా ఉన్నతాధికారులు వరంగల్ జిల్లాలో పర్యటించారు. వరంగల్, కరీంనగర్ అటవీ సర్కిళ్ల పరిధిలో ఉన్న జిల్లాల అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

పల్లె ప్రగతి, తెలంగాణకు హరితహారం, అటవీ రక్షణ పునరుజ్జీవన చర్యలపై చర్చించారు. కొత్తగా నియామకం అయిన ఫారెస్ట్ బీట్ అఫీసర్లకు ఉన్నతాధికారులు మార్గ నిర్దేశం చేశారు.

త్వరలో పట్టణ ప్రగతి కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో అటవీ శాఖ తరపున సంసిద్ధతపై చర్చించారు. పల్లె ప్రగతి తరహాలోనే మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో పచ్చదనం పెంపుకు అటవీ శాఖ తరపున అవసరం మేరకు మొక్కల పంపిణీతో పాటు, సాంకేతిక సహకారం కూడా అందించాల్సి ఉంటుందని అందుకు క్షేత్ర స్థాయి అటవీ సిబ్బంది సిద్దం కావాలని పీసీసీఎఫ్ ఆర్.శోభ ఆదేశించారు.

అటవీ శాఖ పరిధిలో ఉన్న నర్సరీల్లో పెద్ద మొక్కల పెంచేందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జాతీయ, రాష్ట్ర రహదారుల్లో అవెన్యూ ప్లాంటేషన్ చక్కని ఫలితాలు ఇస్తోందని, ఈ విధానాన్ని మరింతగా విస్తరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అటవీ ప్రాంతాల రక్షణలో భాగంగా కందకాలు తవ్వటం, సహజ సిద్దంగా అటవీ పునరుద్దరణ జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అటవీ విస్తీర్ణం తక్కువగా ఉన్న జిల్లాలు, ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, క్షీణించిన అటవీ ప్రాంతాల పునరుజ్జీవనం ప్రాధాన్యత అంశం కావాలన్నారు.

అటవీ భూముల ఆక్రమణలు, కలప స్మగ్లింగ్ ను పూర్తి స్థాయిలో అరికట్టాలని సీ.ఎం ఆదేశించారని, ఈ విషయంలో అధికారులు, సిబ్బంది ఏమాత్రం అలక్ష్యంగా వ్యవహరించవద్దన్నారు. సమస్యలు ఎదురైన చోట్ల కలెక్టర్లను సంప్రదించి, పోలీసు, రెవెన్యూ శాఖల సహకారం తీసుకోవాలని తెలిపారు. వేసవిలో మొక్కలకు నీటి సరఫరా ఏర్పాట్లతో పాటు, అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాల నివారణపై అప్రమత్తంగా ఉండాలని, స్పెషల్ టీమ్ లను నిరంతరం అప్రమత్తంగా ఉంచాలన్నారు. పట్టణాలకు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కుల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

సమావేశంలో పీసీసీఎఫ్ తో పాటు అదనపు అటవీ  సంరక్షణ ప్రధాన అధికారులు RM దొబ్రియల్, MC పర్గయిన్, సిద్ధానంద్ కుక్రేటీ, వరంగల్ & కరీంనగర్ CCF అక్బర్, ఖమ్మం, కొత్తగూడెం CCF రాజారావు, ఆయా జిల్లాలకు చెందిన అటవీ అధికారులు పాల్గొన్నారు.


More Press News