దేశ వ్యాప్తంగా సీడ్స్ రవాణాకు ఆటంకాలు లేకుండా చూడాలి: వినోద్ కుమార్

  • లాక్ డౌన్ నుంచి సీఎం కేసీఆర్ మినహాయింపు ఇచ్చినా.. క్షేత్రస్థాయి పోలీసులకు అవగాహన లేక ఇబ్బందులు

  • ప్రాసెసింగ్ యూనిట్లకు సీడ్స్ చేరనీయాలి

  • లాక్ డౌన్ తో ఇక్కట్లను తొలగించాలి

  • బోయినపల్లి వినోద్ కుమార్ దృష్టికి సమస్యలు

  • తక్షణమే స్పందించిన వినోద్ కుమార్

  • డీజీపీ దృష్టికి సీడ్స్ రవాణా అంశం

  • వినోద్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపిన సీడ్స్ ఉత్పత్తిదారులు

  • దేశానికి అవసరమైన 80 శాతం సీడ్స్ తెలంగాణ నుంచే సరఫరా

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు విత్తనాలు ( సీడ్స్ ) సరఫరాకు రవాణా పరంగా ఎదురవుతున్న ఆటంకాలు లేకుండా చూడాలని సీడ్స్ ఉత్పత్తిదారులు తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ను కోరారు. మంగళవారం బంజారాహిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ నివాసంలో వినోద్ కుమార్ కు వారు తమ సమస్యలు వివరించారు. లాక్ డౌన్ వల్ల తమకు రాష్ట్రంలో గానీ, ఇతర రాష్ట్రాల్లో కానీ రవాణా పరంగా సమస్యలు ఎదురవుతున్నాయని వారు వినోద్ కుమార్ దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా 400 సీడ్స్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయని, సుమారు మూడు లక్షల మంది రైతులు విత్తన ఉత్పత్తిదారులుగా ఉన్నారని వారు వినోద్ కుమార్ కు తెలిపారు.

ప్రధానంగా వరి, మొక్కజొన్న, పత్తి విత్తనాలు ప్రాసెస్ చేసి దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు సరఫరా చేస్తున్నామని వారు పేర్కొన్నారు. వివిధ రకాల పంటలు చేతికి అందుతున్న నేపథ్యంలో రైతుల నుంచి విత్తనాలు ప్రాసెసింగ్ చేసేందుకు యూనిట్లకు చేరాల్సి ఉండగా లాక్ డౌన్ వల్ల జిల్లాల్లో క్షేత్ర స్థాయి పోలీసులు సీడ్స్ రవాణాను అడ్డుకుంటున్నారని వారు వినోద్ కుమార్ కు విన్నవించారు. లాక్ డౌన్ నుంచి నిత్యావసరాల సరుకుల కింద విత్తనాల రవాణాకు సీఎం కేసీఆర్ మినహాయింపు ఇచ్చినా జిల్లాల్లో క్షేత్ర స్థాయి పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

క్షేత్ర స్థాయి పోలీసుల ఇబ్బందుల వల్ల  సీడ్స్ ప్రాసెసింగ్ యూనిట్లకు కూలీలు కూడా రాలేని దుస్థితి ఏర్పడిందని వారన్నారు. దేశవ్యాప్తంగా అవసరమైన 80 శాతం సీడ్స్ తెలంగాణ నుంచే సరఫరా అవుతున్నాయని,  అలాంటప్పుడు రాష్ట్రంలోనే ఇబ్బందులు వస్తే ఎలా అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై తక్షణమే స్పందించిన వినోద్ కుమార్ డీజీపీ మహేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.  విత్తన ఉత్పత్తిదారుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. లాక్ డౌన్ నుంచి సీడ్స్ సరఫరాను సీఎం కేసీఆర్ మినహాయింపు ఇచ్చారని వినోద్ కుమార్ డీజీపీ కి గుర్తు చేశారు. వెంటనే రంగంలో దిగిన డీజీపీ మహేందర్ రెడ్డి డీఐజీ సుమతిని నోడల్ అధికారిగా నియమించి విత్తన ఉత్పత్తిదారులకు ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా చూడాలని ఆదేశించారు.

విత్తన ఉత్పత్తిదారులతో సంప్రదింపులు జరిపిన సుమతి... వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విత్తన ఉత్పత్తిదారులు, పోలీసులు, ట్రాన్స్ పోర్ట్ సిబ్బందితో కలిపి వాట్సాప్ గ్రూప్ ను తయారు చేశారు. ఎవరికి ఎక్కడ సమస్యలు ఎదురైనా వెంటనే వాట్సాప్ గ్రూప్ ద్వారా సమాచారాన్ని అందజేయాలని డీఐజీ సుమతి కోరారు. సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ లకు విత్తన ఉత్పత్తిదారుల కృతజ్ఞతలు. తమ సమస్యలు తక్షణమే పరిష్కారం అయ్యేలా కృషి చేసినందుకు విత్తన ఉత్పత్తిదారుల తరపున ప్రతినిధులు జీ వీ భాస్కర్ రావు, ఏ ఎస్ ఎన్ రెడ్డి లు సీఎం కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, సీడ్స్ ఫెడరేషన్ ఎండి కేశవులు లకు కృతజ్ఞతలు తెలిపారు.


More Press News