పార్లమెంట్ ఆవరణలో రుద్రాక్ష మొక్కను నాటిన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా

  • గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా
  • ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా రుద్రాక్ష మొక్క నాటిన స్పీకర్
ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుతో దేశ వ్యాప్తమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఈ రోజు పార్లమెంటును తాకింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్నారు.

స్వయంగా రుద్రాక్ష మొక్కను నాటారు. పర్యావరణ పరంగా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందని, దేశంలోని ప్రతి ఒక్కరు కూడా ఆ మేరకు చొరవ తీసుకుని మొక్కలు నాటడం వాటిని సంరక్షించడం, అటవీ ప్రాంతాల రక్షణ పట్ల బాధ్యత కలిగి ఉండటం చేయాలని పిలుపునిచ్చారు. ఎంపీ సంతోష్ కుమార్ ను ఆయన అభినందించారు.

సామాజిక బాధ్యతగా సంతోష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను దేశవ్యాప్తంగా చేస్తూ సమాజంలోని ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తున్న తీరు అభినందనీయమని లోక్ సభ స్పీకర్ ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న హరితహారం, అటవీ పునరుద్ధరణ చర్యలను లోక్ సభ స్పీకర్ తో పాటు ఇతరులకు ఈ సందర్భంగా సంతోష్ కుమార్ వివరించారు.

ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు కే.కేశవరావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఇతర ఎంపీలు, పార్లమెంట్ సెక్రటేరియట్ అధికారులు పాల్గొన్నారు. 

More Press News