ఖమ్మం నగరంలో ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ పునరుద్ధరణ: మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
ఖమ్మం నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను పునరుద్ధరిస్తున్నట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. సోమవారం నగరంలోని బస్టాండ్, మయూరి సెంటర్లో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ వ్యవస్థను జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్, పోలీసు కమీషనర్ తప్పీర్ ఇక్బాల్, నగర మేయర్ డా జి. పాపాలాల్ తో కలిసి మంత్రి పువ్వాడ ప్రారంభించారు.
నగరంలో రోజు రోజుకు రద్దీ పెరగడం వల్ల ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు నగరంలోని ఏడు ప్రాంతాలలో ట్రాఫిక్ సిగ్నల్స్ ను పునరుద్ధరించడంతో పాటు మరో ఐదు ప్రాంతాలలో నూతనంగా ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రోడ్డు భద్రత గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు గాను రోడ్డు భద్రతా వారోత్సవాలలో ప్రజలను కూడా భాగస్వాములను చేస్తామన్నారు. రోడ్డుకిరువైపుల ఉన్న దుకాణదారులు ఫుత్ పాత్ లను ఆక్రమించరాదని సూచించారు. అక్రమ ఆక్రమణలన్నీ తొలగించి పాదచారుల కోసం ఫుట్ పాత్ లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
నగరంలో 50 లక్షల వ్యయంతో సి.సి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. నగర ప్రజలందరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించి ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. నగరపాలక సంస్థ కమీషనర్ అనురాగ్ జయంతి, డిప్యూటీ మేయర్ బత్తుల మురళి ప్రసాద్, కార్పోరేటర్లు, ట్రాఫిక్ పోలీసు అధికారులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.