కాబోయే అమ్మలు థైరాయిడ్ పట్ల జాగ్రత్త, అంతర్జాతీయ థైరాయిడ్ దినోత్సవం

డాక్టర్. కృష్ణారెడ్డి తాడూరి

కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్

కిమ్స్ హాస్పిటల్స్, కొండాపూర్.

 

ఈ మధ్యకాలంలో అనేక మంది మహిళలను వేధిస్తున్న సమస్య థైరాయిడ్. 2-5 % గర్భిణీ స్త్రీలు థైరాయిడ్ హార్మోన్ సంబంధిత సమస్యల తో బాధ పడుతున్నారు. ఆధునిక వైద్యం అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మే నెల  25 వ తేదీ ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం సందర్భంగా, థైరాయిడ్ హార్మోన్ ప్రభావం గర్భిణీ స్త్రీలలో ఎలా  ఉంటుందో తెలుసుకుందాం.

సీతాకోక చిలుక ఆకారంలో మెడ భాగంలో ఉండే గ్రంథి పేరే థైరాయిడ్‌.  ఈ థైరాయిడ్ గ్రంథి నుంచి థైరాయిడ్ హార్మోన్ శరీరం లో విడుదల అవుతుంది. ఈ థైరాయిడ్ హార్మోన్ శరీరం లో అన్ని జీవ క్రియలను సమతుల్యంగా ఉంచడానికి అవసరం.ఇది తగిన మొత్తంలో థైరాయిడ్‌ హార్మోన్‌ను  స్రవించక పోయినా ( హైపో థైరాయిడజం) ,  ఎక్కువ మోతాదులో  స్రవించినప్పుడు  (హైపర్ థైరాయిడజం) కూడా సమస్యలు తలెత్తుతాయి.

ఇటీవల కాలంలో హైదరాబాద్‌లో హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం రెండూ పెరుగుతున్నాయి.

గర్భస్థశిశువు మొదటి 10-12 వారాల వరకు థైరాయిడ్ హార్మోన్ కోసం తల్లిపై ఆధారపడుతుంది. తరువాత శిశువు థైరాయిడ్  పూర్తి స్థాయి లో పని చేయడం మొదలు అవుతుంది.కానీ థైరాయిడ్ హార్మోన్ తయారు చేయడానికి కావాల్సిన అయోడిన్ కోసం మాత్రం ప్రసవం అయ్యే వరకు  పూర్తిగా తల్లి పై ఆధార పడుతుంది. అందువలన గర్భిణి స్త్రీలలో థైరాయిడ్, అయోడిన్ తగిన మోతాదులో వుండటం అవసరం.

గర్భిణీ స్త్రీలలో హైపో థైరాయిడజం వలన  గర్భస్రావం(అబార్షన్), రక్తపోటు (బిపి) ఎక్కువగా ఉండటం, రక్తహీనత (అనీమియా),ప్రసవం తరువాత రక్త స్రావం ఎక్కువ గా వుండటం జరగవచ్చు. ఈ హైపోథైరాయిడజం ఎక్కువ గా వున్నప్పుడు శిశువు మెదడు ఎదుగుదల పై ప్రభావం పడుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే  గర్భిణీ స్త్రీలు ఎవరైనా  అప్పటికే  థైరాయిడ్ సమస్యలకు మందులు  వాడుతున్నవారు, థైరాయిడ్ లక్షణాలు ఉన్నవారు వెంటనే థైరాయిడ్  పరీక్షలు చేసుకుని వైద్యుల సూచన మేరకు తగిన సలహాలు పాటించాలి. గర్భిణి స్త్రీలలో హైపర్‌ థైరాయిడిజం  ప్రభావం తల్లికి మరియు శిశువు కి కూడా ఉంటుంది. తల్లి లో రక్త పోటు (బిపి) ఎక్కువ కావడం, నెలలు నిండకుండా కాన్పు జరిగే ప్రమాదం ఉంది. అలాగే శిశువులో ఈ ప్రభావం మూడు రకాలుగా వుండవచ్చు. మొదటిది థైరాయిడ్ హార్మోన్ ప్రభావం. దీని వలన శిశువు తగినంత బరువు పెరగకపోవడం, అవయవ లోపాలు కలిగి వుండటం జరిగే ఆస్కారం వుంది. రెండవది  థైరాయిడ్ యాంటీ బాడీస్ ప్రభావం. తల్లి లో హైపర్ థైరాయిడిజం  Grave's డిసీజ్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధి వలన వచ్చి వుంటే  , వీరిలో ఉన్న ఆటో యాంటీ  బాడీస్ మాయ ద్వారా శిశువు కి  వెళ్లి థైరాయిడ్ పని తీరు పై  ప్రభావం  చూపిస్తాయి. అయితే ఈ ప్రభావం  తాత్కాలికం గా  3-6 నెలలు వరకు ఉంటుంది. మూడవది  యాంటీ థైరాయిడ్ మందుల ప్రభావం. ఈ మందులు రక్తం నుంచి మాయ ద్వారా శిశువు కి వెళ్లి శిశువు థైరాయిడ్‌ పనితీరు పై ప్రభావం చూపిస్తాయి. అవయవ లోపాలు వచ్చే అవకాశం కూడా అరుదు గా ఉంటుంది. కానీ రెగ్యులర్ గా థైరాయిడ్  హార్మోన్ పరీక్షలు చేయించుకోవడం, అవసరమైన వారిలో యాంటీ బాడీస్ పరీక్ష చేయించుకోవడం, వైద్యుల సలహా మేరకు యాంటీ థైరాయిడ్ మందులు వాడటం, గర్భం లో వున్న శిశువు ని ప్రసవం ముందు, తర్వాత  కూడా గమనించడం వలన చాలా వరకు ఈ సమస్య నుండి సురక్షితంగా బయట పడవచ్చు.

More Press News