Congress: రాజగోపాల్ రెడ్డికి అమిత్ షా గూగుల్‌పే ద్వారా రూ.22 వేల కోట్లు పంపారట!... మాణిక్కం ఠాగూర్ వీడియో ఇదిగో!
- రాజగోపాల్ రెడ్డికి అమిత్ షా రూ.22 వేల కోట్లు ఇచ్చినట్లుగా మాణిక్కం ఠాగూర్ ఆరోపణ
- అదే విషయాన్ని ఓ వీడియో ద్వారా సెటైరికల్‌గా వివరించిన వైనం
- కోమటిరెడ్డికి గూగుల్ పే ద్వారా అమిత్ షా డబ్బు ఇచ్చినట్లుగా వీడియోను పోస్ట్ చేసిన కాంగ్రెస్ నేత
- సోషల్ మీడియా వేదికగా నవ్వులు పూయిస్తున్న వీడియో
మునుగోడు ఉప ఎన్నికలో రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అదే సమయంలో సెటైర్లతో కూడిన టపాసులు కూడా పేలుతున్నాయి. తాజాగా కడుపుబ్బా నవ్వించే వీడియోలతో ప్రత్యర్థులపై ఆయా పార్టీల నేతలు చేస్తున్న విచిత్ర దాడులు కూడా మొదలయ్యాయి. ఈ తరహా కొత్త దాడుల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ మంగళవారం సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికర వీడియోను పోస్ట్ చేశారు.
ఈ వీడియోలో మునుగోడులో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గూగుల్ పే ద్వారా రూ.22,000 కోట్లు చెల్లించినట్లుగా ఠాగూర్ వెల్లడించారు. అది కూడా బీజేపీలోకి స్వాగతం చెబుతూ ఈ మొత్తాన్ని పంపించారట. ఈ ట్రాన్సాక్షన్‌కు సంబంధించి జరిగిన వరుస పరిణామాలను కూడా ఠాగూర్ అందులో విస్పష్టంగానే వివరించారు.
ఠాగూర్ వీడియోలో తొలుత గూగుల్ పే స్క్రీన్‌పై మోదీతో కలిసి ఉన్న అమిత్ షా ఫొటో కనిపిస్తుంది. ఆ తర్వాత ఆర్జీ పాల్ పేరు కొట్టగానే... రాజగోపాల్ రెడ్డి ఖాతా కనిపిస్తుంది. ఆ ఖాతాకు 22,000 కోట్లను ఎంటర్ చేసిన అమిత్ షా... వెల్కమ్ టూ బీజేపీ అని టైప్ చేసి పిన్ ఎంటర్ చేయగానే... అమిత్ షాకు చెందిన స్విస్ బ్యాంకు ఖాతా నుంచి కోమటిరెడ్డి ఖాతాకు రూ.22,000 కోట్లు జమ అవుతాయి.
ఈ మొత్తాన్ని స్వీకరిచించినట్లుగా కోమటిరెడ్డి కూడా రిసీవ్డ్ అంటూ మెసేజ్ పెట్టారు. అంతకుముందు థ్యాంక్యూ అంటూ అమిత్ షాకు కృతజ్ఞతలు కూడా చెప్పారు. ఈ ట్రాన్సాక్షన్‌కు సంబంధించి అమిత్ షాకు ఓ స్క్రాచ్ కార్డు రాగా... అమిత్ షా దానిని ఓపెన్ చేస్తారు. అందులో బెటర్ లక్ నెక్ట్స్ టైమ్... మునుగోడు నాట్ ఫర్ సేల్ అనే సందేశం కనిపిస్తుంది. ఈ వీడియోకు ఇంటరెస్టింగ్ ఫ్యాక్ట్ అంటూ ఠాగూర్ ఓ కామెంట్ జత చేశారు.