బెంగళూరు నగరాభివృద్ధి శాఖ కోసం నేతల పోటీ... ఏముంది అందులో?

Karnataka Congress crisis ends as CM says Ramalinga Reddy dispute settled
  • బీడీఏ, మెట్రో సంస్థలపై ఈ శాఖ మంత్రికే నియంత్రణ
  • నగర పరిధిలోనే 28 అసెంబ్లీ స్థానాలు
  • భూసేకరణ, ప్లానింగ్ అధికారాలతో పెరిగిన ప్రాధాన్యం
  • రూ.వేల కోట్ల ప్రాజెక్టులతో ప్రజల్లో గుర్తింపు

కర్ణాటకలో కొత్తగా ఏర్పడిన డీకే.శివకుమార్ ప్రభుత్వంలో ‘బెంగళూరు నగరాభివృద్ధి’ శాఖ కేటాయింపుపై అసంతృప్తి చెలరేగిన విషయం తెలిసిందే. ఆ శాఖ ఇవ్వలేదన్న కారణంతో మంత్రి రామలింగారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. దీంట్లో రాష్ట్ర రాజకీయాల్లో ఈ పోర్ట్‌ఫోలియోకు ఉన్న ప్రాధాన్యం చర్చనీయాంశమైంది. ఇతర బడా శాఖలతో సమానంగా ఈ మంత్రి పదవి కోసం సీనియర్ నేతలు ఎందుకు పోటీ పడుతుంటారో ఈ వివాదం ద్వారా బహిర్గతమైంది.

బెంగళూరు కేవలం ఒక నగరం మాత్రమే కాదు. కర్ణాటక రాష్ట్రానికే అది ఒక ప్రధాన ఆర్థిక వనరు. రాష్ట్ర ఆదాయంలో సింహభాగాన్ని అందిస్తూ ఏటా రూ.వేల కోట్ల ప్రభుత్వ, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఈ గ్లోబల్ సిటీకి సంబంధించిన మౌలిక సదుపాయాలు, హౌసింగ్, రవాణా, పట్టణ ప్రణాళిక వంటి కీలక నిర్ణయాలన్నీ ఈ శాఖ పరిధిలోనే జరుగుతాయి. మిలియన్ల కొద్దీ ప్రజల జీవితాలను శాసించే ఈ శాఖ చేతిలో ఉంటే రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని పట్టు సాధించవచ్చని నేతలు భావిస్తుంటారు.

ఈ శాఖకు ఇంతటి ప్రాముఖ్యత ఏర్పడడానికి దీని పరిధిలోని ప్రభుత్వ సంస్థలే ప్రధాన కారణం. బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ, గ్రేటర్ బెంగళూరు అథారిటీ, మెట్రో రైల్ కార్పొరేషన్, జలమండలి వంటి కీలక సంస్థలన్నీ ఈ మంత్రిత్వ శాఖ కిందే పనిచేస్తాయి. నగరంలో అత్యంత విలువైన వనరుగా భావించే భూముల సేకరణ, లేఅవుట్ అనుమతులు, నమ్మ మెట్రో విస్తరణ, రోడ్డు ప్రాజెక్టుల వంటి భారీ బడ్జెట్ పనులన్నీ నేరుగా ఈ శాఖ పర్యవేక్షణలోనే సాగుతాయి.

గతంలో ఈ శాఖను ముఖ్యమంత్రులు లేదా ఉప ముఖ్యమంత్రులే తమ వద్ద ఉంచుకునేవారు. 1999-2004 మధ్య ఐటీ రంగం పుంజుకుంటున్నప్పుడు అప్పటి సీఎం ఎస్.ఎం. కృష్ణ స్వయంగా ఈ బాధ్యతలు చూశారు. ఆ తర్వాత బి.ఎస్. యడియూరప్ప, బసవరాజ్ బొమ్మై, కుమారస్వామి వంటి సీఎంలు దీనిని తమ వద్దే ఉంచుకోగా.. గత సిద్ధరామయ్య ప్రభుత్వంలో డీకే. శివకుమార్ డిప్యూటీ సీఎంగా ఉంటూ ఈ బాధ్యతలు నిర్వహించారు. 2015లో సిద్ధరామయ్య హయాంలోనే కేజే జార్జ్ దీనికి పూర్తిస్థాయి తొలి కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

మరోవైపు బెంగళూరు నగర పరిధిలోనే ఏకంగా 28 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న ఓటర్లను, ప్రజా సమస్యలను నేరుగా ప్రభావితం చేసే అవకాశం ఈ మంత్రికి ఉంటుంది. రోడ్లు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కోసం రూ.వేల కోట్ల పెట్టుబడులతో కూడిన ప్రాజెక్టులు ఇక్కడ జరుగుతుండటంతో ఈ మంత్రికి ప్రజల్లో గుర్తింపు ఎక్కువగా ఉంటుంది. ప్రాజెక్టులు సక్సెస్ అయితే సదరు నేత ప్రతిష్ఠ రాష్ట్ర స్థాయికి పెరుగుతుంది. అందుకే ఈ శాఖకు ఇంతటి ప్రాధాన్యత ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Go Back to Shorts
Ramalinga Reddy
DK Shivakumar
Karnataka Congress Crisis
Karnataka Cabinet Portfolios
Randeep Singh Surjewala
Bengaluru Development Ministry
Karnataka Politics
Congress Internal Dispute
Narendra Modi
Karnataka Government News

More Telugu News