కోటిచెరువు భూమిని వెంటనే వెనక్కివ్వు: పవన్ కల్యాణ్‌పై కవిత ఫైర్

K Kavitha demands Pawan Kalyan to return Koticheruvu land immediately
  • కోటి చెరువు శిఖం భూమిని పవన్ కబ్జా చేశారన్న కవిత
  • తెలంగాణ ప్రభుత్వానికి భూమిని అప్పగించాలని డిమాండ్
  • తెలంగాణ కచ్చితంగా తమ జాగీరేనని వ్యాఖ్య

తెలంగాణ రాజకీయాల్లో భూకబ్జాల వ్యవహారం ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వర్సెస్ కవితగా మారి సరికొత్త వివాదానికి తెరలేపింది. హైదరాబాద్‌లోని 'కోటిచెరువు' శిఖం భూమిని పవన్ కల్యాణ్ కబ్జా చేశారంటూ టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. జూబ్లీహిల్స్‌లోని పార్టీ ఆఫీస్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో ఆమె మాట్లాడుతూ.. పవన్ గనుక ఆ భూమిని ఆక్రమించలేదని చెబితే, వెంటనే ఆ స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించి, అక్కడి నిర్మాణాలను, మట్టిని తొలగించాలని డిమాండ్ చేశారు.


నీటిపారుదల శాఖ రికార్డుల ప్రకారం ఆ 10 ఎకరాల భూమి పూర్తిగా 'శిఖం' (ప్రభుత్వ) భూమి అని కవిత స్పష్టం చేశారు. కానీ రిజిస్ట్రేషన్ సమయంలో కేవలం 3 ఎకరాలను మాత్రమే శిఖం భూమిగా చూపి, మిగిలిన 7 ఎకరాలను 'మాగాణి' (ప్రైవేట్) భూమిగా మార్చేశారని.. ఇది స్పష్టమైన నిబంధనల ఉల్లంఘనే అని ఆమె ఎండగట్టారు.


ఇటీవల పవన్ చేసిన "తెలంగాణ మీ అబ్బ సొత్తా.. మీ జాగీరా?" అనే వ్యాఖ్యలపై కవిత అత్యంత ఘాటుగా స్పందించారు. "అవును, ఇది కచ్చితంగా మా జాగీరే! 1,200 మంది అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ ఇది. ఇది తెలంగాణ ప్రజల సొత్తు, ఎవరి ముత్తాతలదో కాదు" అని కవిత ప్రతిస్పందించారు.

ఆంధ్రప్రదేశ్‌లో రాజధానిని కూడా నిర్మించలేకపోయిన పవన్.. ఇప్పుడు తెలంగాణలో కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీకి సరైన స్థానిక నాయకులు లేకపోవడం వల్లే పవన్‌ను వాడుకుంటున్నారని విమర్శించారు.


ప్రజా గాయకుడు గద్దర్‌కు తాను కారు కొనిచ్చి సాయం చేశానన్న పవన్ వ్యాఖ్యలను కూడా కవిత తప్పుబట్టారు. నైజాం ఏరియా నుంచి తన సినిమాల ద్వారా కోట్లాది రూపాయల రెవెన్యూ సంపాదిస్తున్న పవన్.. ఇక్కడి జానపద కళాకారులను గానీ, చిన్న నిర్మాణాత్మక శక్తులను గానీ ఎప్పుడైనా ఆదుకున్నారా? అని ప్రశ్నించారు. పైగా జానపద కళాకారుల ట్యూన్లను వాడుకుంటూ వారికి కనీస గుర్తింపు ఇవ్వడం లేదని ఆరోపించారు.


ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆమె ఒక ఆసక్తికరమైన పోలికను తెరపైకి తెచ్చారు. "అప్పట్లో K.T.R (కేసీఆర్, టి. హరీశ్ రావు, రామారావు (కల్వకుంట్ల తారకరామారావు) పాలన అనుకుంటే.. ఇప్పుడు కూడా నడుస్తోంది KTR (కొండారెడ్డి, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి) పాలనే" అంటూ వ్యగ్యంగా కామెంట్ చేశారు. గతంలో దోపిడీకి కిటికీలు తెరిస్తే... ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా తలుపులే బార్లా తెరిచిందని ఆరోపించారు. ప్రభుత్వ భూములను ఇలాగే అమ్మేసుకుంటూ పోతే రాబోయే తరాలకు ఏమీ మిగలదని, ఈ ల్యాండ్ స్కామ్‌లన్నింటినీ తాము త్వరలోనే బయటపెడతామని కవిత హెచ్చరించారు.
Go Back to Shorts
K Kavitha
Pawan Kalyan
Koticheruvu land dispute
Hyderabad land encroachment
Telangana politics
BRS party
Revanth Reddy
Shikham land issue
Janasena Party
Telangana land scam

More Telugu News