కార్ల మార్కెట్లో అమ్మకాల జోరు... మహీంద్రాను వెనక్కినెట్టిన టాటా మోటార్స్

Tata Motors overtakes Mahindra in Indian car market rankings
  • మే నెలలో కార్ల అమ్మకాలు
  • మహీంద్రాను వెనక్కినెట్టి రెండో స్థానానికి ఎగబాకిన టాటా మోటార్స్
  • అగ్రస్థానంలో కొనసాగుతున్న మారుతీ సుజుకీ
  • గతేడాదితో పోలిస్తే 26% వృద్ధి నమోదు
  • మార్కెట్లో 94% వాటా టాప్ 6 కంపెనీలదే
భారత ప్యాసింజర్ వాహనాల మార్కెట్ 2026 మే నెలలో అమ్మకాల పరంగా బలమైన వృద్ధిని నమోదు చేసింది. గతేడాది మే నెలతో పోలిస్తే ఈసారి అమ్మకాలు 26.05% పెరిగి, మొత్తం 4,40,808 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈసారి అమ్మకాల్లో కీలక మార్పు చోటుచేసుకుంది. దేశీయ ఆటో దిగ్గజం మహీంద్రాను వెనక్కి నెట్టి, టాటా మోటార్స్ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది.

ఎప్పటిలాగే, మారుతీ సుజుకీ 1,90,337 యూనిట్ల అమ్మకాలతో అగ్రస్థానంలో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. గతేడాదితో పోలిస్తే కంపెనీ అమ్మకాల్లో ఏకంగా 39.99% వృద్ధి కనిపించింది. దీంతో మారుతీ మార్కెట్ వాటా 43.18 శాతానికి పెరిగింది.

రెండో స్థానం కోసం జరిగిన తీవ్రమైన పోటీలో టాటా మోటార్స్ విజయం సాధించింది. టాటా 59,090 వాహనాలను విక్రయించగా, మూడో స్థానానికి పడిపోయిన మహీంద్రా 58,021 యూనిట్లను అమ్మింది. ఈ రెండు కంపెనీల మధ్య అమ్మకాల వ్యత్యాసం కేవలం 1,069 యూనిట్లు మాత్రమే. గతేడాది ఇదే సమయంతో పోల్చితే టాటా 42.19% వృద్ధి సాధించగా, మహీంద్రా వృద్ధి 10.66% వద్దే నిలిచింది.

ఇక హ్యుందాయ్ 47,837 యూనిట్లతో నాలుగో స్థానంలో, టయోటా 30,574 యూనిట్లతో ఐదో స్థానంలో ఉన్నాయి. కియా 27,586 యూనిట్లతో ఆరో స్థానాన్ని దక్కించుకుంది. ఈ టాప్ 6 కంపెనీల వాటానే మొత్తం మార్కెట్లో దాదాపు 94% ఉండటం గమనార్హం. టాటా పంచ్, నెక్సాన్, మారుతీ బ్రెజా, మహీంద్రా స్కార్పియో వంటి ఎస్ యూవీ మోడళ్లు ఈ అమ్మకాల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి.
Go Back to Shorts
Tata Motors
Indian Car Market
Maruti Suzuki
Mahindra
Passenger Vehicle Sales
May 2026 Car Sales India
Hyundai India
Toyota Kirloskar
Kia India
SUV Sales Trends

More Telugu News