సైక్లింగ్‌ మంచి కార్డియో వ్యాయామం. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు బరువు నియంత్రణకు, కండరాల బలోపేతానికి ఉపయోగపడుతుంది. అయితే ఎక్కువ సమయం, తీవ్రంగా సైక్లింగ్‌ చేసే పురుషుల్లో వీర్య నాణ్యతపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే దీనివల్ల శాశ్వతంగా సంతానలేమి వస్తుందని మాత్రం నిర్ధారణ కాలేదు.

ఎక్కువసేపు సైక్లింగ్‌తో ఇబ్బందేనా?
సాధారణంగా 20-30 నిమిషాల పాటు సరదాగా సైక్లింగ్‌ చేయడం ఆరోగ్యానికి మంచిదే. కానీ వారానికి 5 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సైక్లింగ్‌ చేసే పురుషుల్లో తక్కువ వీర్యకణాల సంఖ్య కనిపించే అవకాశం పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

ఎక్కువసేపు సైకిల్‌ సీటుపై కూర్చోవడం వల్ల జననాంగాల మధ్య భాగంపై ఒత్తిడి పెరుగుతుంది. వృషణాల చుట్టూ ఉష్ణోగ్రత పెరగొచ్చు. రక్తప్రసరణ కూడా కొంతకాలం తగ్గొచ్చు. ఇవి వీర్యకణాల సంఖ్య, కదలిక, ఆకృతిపై ప్రభావం చూపే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

వేడి, ఒత్తిడి కారణమా?
ఎక్కువసేపు బిగుతైన దుస్తులతో సైక్లింగ్‌ చేయడం వల్ల వృషణాల ఉష్ణోగ్రత పెరగొచ్చు. సరైన సీటు లేకపోతే నరాలు, రక్తనాళాలపై ఒత్తిడి పడే అవకాశం ఉంది. సీటు రాపిడి వల్ల చిన్నపాటి గాయాలు, మంట కూడా రావొచ్చు.

వీర్యకణాలు తయారై పూర్తిగా అభివృద్ధి చెందడానికి సుమారు రెండున్నర నుంచి మూడు నెలలు పడుతుంది. అందువల్ల జీవనశైలిలో మార్పుల ప్రభావం వెంటనే కాకుండా కొన్ని నెలల తర్వాత కనిపించొచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఎక్కువసేపు సైక్లింగ్‌ చేసే పురుషులు మధ్యలో విరామాలు తీసుకోవాలి. జననాంగాల మధ్య భాగంపై ఒత్తిడి తగ్గించేలా సరైన సీటును ఎంచుకోవాలి. మధ్యలో కట్‌అవుట్‌ ఉన్న సీట్లు కొంత ఉపశమనం ఇవ్వొచ్చు. ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చోకుండా మధ్యమధ్యలో లేచి నిలబడటం కూడా ఉపయోగపడుతుంది.

సంతానోత్పత్తి ఆరోగ్యానికి వారానికి 150-180 నిమిషాల మితమైన వ్యాయామం సరిపోతుందని డాక్టర్లు సూచిస్తున్నారు. అతిగా, తీవ్రంగా వ్యాయామం చేయడం కంటే క్రమం తప్పకుండా మితమైన వ్యాయామం చేయడం మంచిదని తెలిపారు.