ఎస్ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్ కు ఈడీ కస్టడీ
- దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎస్ బ్యాంకు సంక్షోభం
- ఆదివారం వేకువజామున రాణా కపూర్ అరెస్ట్
- మార్చి 11 వరకు కస్టడీ విధించిన న్యాయస్థానం
ఎస్ బ్యాంకు సంక్షోభం ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. తాజాగా అరెస్ట్ అయిన ఎస్ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్ ను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ముంబయి కోర్టు తీర్పు వెలువరించింది. మార్చి 11 వరకు రాణా కపూర్ ఈడీ కస్టడీలో ఉండాలని ఆదేశించింది. ఎస్ బ్యాంకు దుస్థితికి రాణా కపూర్ అక్రమాలే కారణమని అధికారులు అనుమానిస్తున్నారు. అనేక కార్పొరేట్ సంస్థలకు ఎస్ బ్యాంకు నుంచి భారీ ఎత్తున రుణాలు ఇవ్వడంలో కపూర్ అవినీతికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. దీనిపై దృష్టి సారించిన ఈడీ రాణా కపూర్ పై అక్రమ నగదు చెలామణి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి, ఆదివారం వేకువజామున అరెస్ట్ చేసింది. అంతకుముందు, గత రెండు రోజులుగా ఆయన నివాసంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.