బెంగళూరులో పోలీసులతో మధ్యప్రదేశ్ మంత్రి దురుసు ప్రవర్తన.. అరెస్టు!

  • నగరంలోని శిబిరంలో ఉన్న జ్యోతిరాదిత్య వర్గం ఎమ్మెల్యేలు 
  • వాళ్లను కలిసేందుకు వచ్చిన మంత్రి జీతూ పట్వారీ
  • పోలీసులపై దౌర్జన్యం చేశారని అరెస్టు

రాజకీయ సంక్షోభంలో పడిన మధ్యప్రదేశ్ రాజకీయం బెంగళూరు కేంద్రంగా నడుస్తోంది. అసమ్మతి వర్గం శిబిరం ఇక్కడ ఉండడంతో అక్కడి ప్రభుత్వం కళ్లు ఇటువైపే ఉన్నాయి. ఈ నేపధ్యంలో శిబిరానికి వచ్చిన మధ్యప్రదేశ్ మంత్రి అసహనంతో బెంగళూరు పోలీసులపట్ల దురుసుగా వ్యవహరించడంతో ఆయన్ని అరెస్టు చేయడం సంచలనమైంది. 

వివరాల్లోకి వెళితే...మధ్యప్రదేశ్ లోని కమల్ నాథ్ ప్రభుత్వంలో సంక్షోభం అలముకున్న విషయం తెలిసిందే. పార్టీ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకోవడం, ఆయన వెంటే ఆరుగురు మంత్రులు సహా 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో కమల్ నాథ్ సర్కారు పడిపోయే ప్రమాదం ఏర్పడింది. తమ సర్కారుకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదని ముఖ్యమంత్రి బీరాలు పలుకుతున్నా పరిస్థితి అంత కుదురుగా లేదు.

ఈ పరిస్థితుల్లో సర్కారును కాపాడుకునేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాలతో కొందరు నాయకులు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ఆ రాష్ట్ర మంత్రి జీతూ పట్వారీ జ్యోతిరాదిత్య వర్గం ఉంటున్న రిసార్ట్స్ కు వచ్చారు. అయితే, ఆయన్ని లోనికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన మంత్రి పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

ఈ సందర్భంలో జీతూ కాస్త అతిగా ప్రవర్తించడంతో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు తమ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలను బెంగళూరు పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిసిందని, వారిని వదలకపోతే తాము కోర్టుకెక్కుతామని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలు హెచ్చరించడం గమనార్హం.



More Telugu News