ఏసీ డబ్బు వాపసంటూ ఖాతా వివరాలు తెలుసుకుని రూ.లక్షకు టోకరా!

  • పాడయ్యిందని టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ 
  • రెండు నెలలకే మరమ్మతులకు వచ్చినందుల్ డబ్బులిచ్చేస్తామని వల 
  • ఖాతా వివరాలు చెప్పాక డబ్బు మాయం

సైబర్ క్రైం నేరగాళ్ల ఎత్తుగడలు అంతుచిక్కనివిగా ఉంటున్నాయి. జనంలో వీరిపట్ల కాస్త చైతన్యం పెరగడంతో డబ్బు కాజేసేందుకు వారు అనుసరిస్తున్న సరికొత్త మార్గాలు అన్నీ ఇన్నీ కావు. ఇందుకు ఈ మోసం చక్కని ఉదాహరణ. హైదరాబాద్ నగరంలోని మొహిదీపట్నంలో ఉంటున్న మురళీకృష్ణ రెండు నెలల క్రితం రూ.36,889లు పెట్టి ఏసీ కొనుగోలు చేశారు. అది కాస్తా పనిచేయక పోవడంతో నెట్ లో నుంచి కంపెనీ కస్టమర్ కేర్ నంబర్ తీసుకుని ఫోన్ చేశాడు. అటు నుంచి తన పేరు రమేష్ అంటూ ఓ వ్యక్తి పరిచయం చేసుకున్నాడు.

మురళీ కృష్ణ చెప్పిన వివరాలన్నీ విన్నాక రెండు నెలలకే ఏసీ పాడైనందున మా కంపెనీ నిబంధనల ప్రకారం డబ్బు మొత్తం వాపసు చేస్తామని, మీ అకౌంట్ నంబరు ఇవ్వాలని కోరాడు. మురళీకృష్ణ వివరాలు చెప్పగానే ఆ అకౌంట్ కు రూ.3690 జమ చేశాడు.

కొద్ది సేపటికే రమేష్ మళ్లీ ఫోన్ చేసి మీకు డబ్బు ముట్టినట్లు నేను పంపిన సంక్షిప్త సందేశంలో వివరాలు నమోదు చేసి పంపిస్తే మిగిలిన డబ్బు కూడా జమ చేస్తానని నమ్మించాడు. మురళీకృష్ణ నిజమేనని నమ్మి వివరాలు ఇచ్చిన కాసేపటికి రమేష్ వేసిన రూ.3,690తోపాటు తన ఖాతాలోని లక్షా 8 వేల రూపాయలు మాయమయ్యాయని బాధితుడు లబోదిబోమంటూ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.



More Telugu News