చిలుకూరులో నిర్భయ దోషుల దిష్టిబొమ్మ దహనం
- 'రేపాసుర' పేరుతో నలుగురితో బొమ్మ తయారీ
- అనంతరం బాలాజీ టెంపుల్ వద్ద నిప్పు
- నరకాసురులను ఉరితీశారని ఆనందం
నిర్భయ దోషులను ఉరితీసిన నేపథ్యంలో హైదరాబాద్ శివారులోని చిలుకూరి వాసులు 'రేపాసుర' దిష్టిబొమ్మను దహనం చేశారు. దోషులు అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముఖేష్ సింగ్ లను నిన్న ఉదయం 5.30 గంటలకు ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉరితీసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో నరకాసురుడి వధతో వీరి ఉరితీతను పోలుస్తూ చిలుకూరు వాసులు నలుగురు దోషులతో కలిపి పదకొండు అడుగుల ఎత్తున బొమ్మను తయారు చేశారు. దానికి 'రేపాసుర' అని నామకరణం చేసి నిప్పంటించారు. ఈ సందర్భంగా చిలుకూరు బాలాజీ టెంపుల్ పూజారి రంగరాజన్ మాట్లాడుతూ నాడు నరకాసురుడిని చంపినప్పుడు ప్రజలు ఎంత ఆనందించారో, నేడు నిర్భయ దోషుల ఉరి తర్వాత జనం అంతగా ఆనందించరాని చెప్పారు.
అప్పట్లో సీతమ్మను కాపాడేందుకు జటాయువు పోరాడిందని, నేడు నిర్భయ దోషులకు శిక్ష పడేందుకు ప్రతి పౌరుడు ఒక జటాయువులా పోరాడడంతో నిర్భయ తల్లిదండ్రులకు న్యాయం జరిగిందన్నారు. మహిళల కోసం చట్టాలు ఉంటే సరిపోవని, అవి అమలయ్యేలా యువత పోరాడాలని సూచించారు.