ప్రభుత్వ ఉద్యోగులందరూ కార్యాలయాలకు రావాల్సిన అవసరంలేదు: సీఎం కేసీఆర్

  • తెలంగాణలో ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్
  • అత్యవసర సర్వీసుల ఉద్యోగులు తప్పనిసరిగా హాజరవ్వాలని ఆదేశం
  • విద్యావ్యవస్థకు సంబంధించి అన్ని కార్యక్రమాలు బంద్ అని వెల్లడి
తెలంగాణలో కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, ఈ నెల 31 వరకు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కార్యాలయాలకు రావాల్సిన అవసరంలేదని, కొన్ని కీలక సర్వీసులకు సంబంధించిన ఉద్యోగులు తప్ప మిగిలిన ఉద్యోగులు ఇళ్లలోనే ఉండొచ్చని తెలిపారు. వైద్య విభాగం, విద్యుత్ శాఖ తదితర అత్యవసర సర్వీసులు ఉద్యోగులు వంద శాతం కార్యాలయాలకు హాజరవ్వాలని, 20 శాతం రొటేషన్ పద్ధతిలో కార్యాలయాలకు హాజరవ్వాల్సి ఉంటుందని వివరించారు.

ఇక, విద్యా వ్యవస్థకు సంబంధించిన ఏ కార్యక్రమం జరగదని, పరీక్ష పత్రాల మూల్యాంకనం కూడా నిలిపివేస్తున్నామని సీఎం చెప్పారు. మార్చి 31వ తేదీ తర్వాత సమీక్ష నిర్వహించి తదుపరి పరిణామాలపై అప్పుడు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. భవన నిర్మాణ రంగ కార్మికులు, కాంట్రాక్టర్ల కింద పనిచేసే సిబ్బందికి విధిగా ఈ వారం రోజులకు సరిపడా వేతనాలు చెల్లించాలని స్పష్టం చేశారు. వారిని ప్రభుత్వం కూడా ఆదుకుంటుందని చెప్పారు.


More Telugu News