‘నిజమైన ప్రపంచ హీరో’.. లాక్‌డౌన్‌లో డీఎస్పీగా సేవలందిస్తున్న జోగిందర్‌పై ఐసీసీ ప్రశంసలు

  • 2007 టీ20 ప్రపంచకప్ గెలుచుకోవడంలో కీలక పాత్ర
  • ప్రస్తుతం హర్యానాలో డీఎస్పీగా సేవలు
  • లాక్‌డౌన్ విధుల్లో జోగిందర్
జోగిందర్‌శర్మ.. భారత క్రికెట్ అభిమానుల్లో ఈ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. 2007లో టీ20 ప్రపంచకప్‌ను భారత్ సొంతం చేసుకోవడంలో శర్మది కీలకపాత్ర. పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్‌లో ఆఖరి ఓవర్ వేసిన జోగిందర్.. మిస్బా ఉల్ హక్‌ను అవుట్ చేసి భారత్‌కు ప్రపంచకప్ అందించి ‘టీ20 ప్రపంచకప్ హీరో’గా అభిమాల మనసుల్లో నిలిచిపోయాడు.

ఇక ప్రస్తుత విషయానికి వస్తే.. కోవిడ్-19ను నివారించేందుకు ప్రభుత్వం 21 రోజులపాటు లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో జోగిందర్ మళ్లీ మెరిశాడు. ప్రస్తుతం హర్యానాలో డీఎస్పీగా పనిచేస్తున్న జోగిందర్.. లాక్‌డౌన్ సందర్భంగా విధులు నిర్వర్తిస్తూ కనిపించాడు. ఈ ఫొటోను షేర్ చేసిన ఐసీసీ అతడిని ప్రశంసించింది. 2007లో ‘టీ20 ప్రపంచకప్ హీరో’.. 2020లో ‘నిజమైన ప్రపంచ హీరో’ అని కామెంట్ చేసింది. ఐసీసీ పోస్టు చేసిన కాసేపటికే ఈ ఫొటో వైరల్ అయింది. జోగిందర్‌పై అభిమానులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


More Telugu News