లాక్‌డౌన్‌ పొడిగిస్తే భారత ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది: ప్రపంచ బ్యాంకు

  • 2021 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 2.8కి దిగజారనుంది
  • భారత ఆర్థిక వ్యవస్థపై లాక్‌డౌన్‌ ప్రభావం తీవ్రంగా పడనుంది  
  • ముఖ్యంగా సేవారంగం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కునే అవకాశం
  • తిరిగి 2022లో వృద్ధి 5 శాతానికి పుంజుకుంటుంది  
దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారి పోతుందని ఆందోళన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రపంచ బ్యాంకు పునరుద్ఘాటించింది. 2021 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 2.8కి దిగజారనుందని తెలిపింది. ఇప్పటికే క్షీణిస్తోన్న భారత ఆర్థిక వ్యవస్థపై లాక్‌డౌన్‌ ప్రభావం తీవ్రంగా పడనుంది.

'దక్షిణాసియా ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం' పేరిట తాజాగా ప్రపంచ బ్యాంకు ఓ నివేదికను విడుదల చేసింది. లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో ఈ అంశం భారత్‌పై ప్రతికూల ప్రభావం పడేలా చేస్తుందని వివరించింది. ఒకవేళ లాక్‌డౌన్‌ను పొడిగిస్తే ప్రపంచ బ్యాంకు అంచనాల కంటే ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందని తెలిపింది.

ముఖ్యంగా సేవారంగం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కునే అవకాశం ఉందని చెప్పింది. దేశీయ పెట్టుబడుల్లో జాప్యం చోటుచేసుకోవచ్చని, తిరిగి 2022లో వృద్ధి 5 శాతానికి పుంజుకుంటుందని చెప్పుకొచ్చింది. వీలైనంత తొందరగా కరోనాను కట్టడి చేయాలని ప్రపంచ బ్యాంకు దక్షిణాసియా చీఫ్‌ ఎకనమిస్ట్‌ హన్స్‌ టిమ్మర్‌ చెప్పారు.

అలాగైతేనే ప్రతికూల ప్రభావాన్ని చాలా మేరకు తగ్గించవచ్చని తెలిపారు. లాక్‌డౌన్‌ల నేపథ్యంలో  బ్యాంకుల దివాళాలను కట్టడి చేయాలని,  ప్రజలకు తాత్కాలిక ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచనలు చేసింది.

కరోనాను కట్టడి చేయడానికి భారత్‌కు ప్రపంచ బ్యాంకు ఇప్పటికే సాయం ప్రకటించింది. కరోనా మహమ్మారి పోరుకు ప్రపంచ బ్యాంకు భారత్‌కు ఒక బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.7,600 కోట్లు) అత్యవసర సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈమేరకు భారత్‌ చేసిన అభ్యర్థనపై వరల్డ్‌ బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది.


More Telugu News