ఏపీకి చెందిన ఓ వ్యక్తి వల్ల యూపీలో 14 గ్రామాల సీజ్‌

  • గత నెల తబ్లిగీ జమాత్‌కు హాజరైన ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్
  • అతను ఉంటున్న గ్రామానికి 3 కి.మీ. పరిధిలో గ్రామాలన్నీ క్వారంటైన్‌లోకి
  • ఆగ్రాలో సోమవారం మరో 30 కొత్త కేసులు
ఢిలీలో జరిగిన తబ్లిగీ జమాత్ సదస్సుకు హాజరై వచ్చిన ఒక వ్యక్తికి కరోనా సోకిన కారణంగా అధికారులు ఏకంగా 14 గ్రామాలను అధికారులు సీజ్ చేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌ బదౌన్‌ జిల్లాలో జరిగింది. ఈ జిల్లాలోని భవానీపూర్ ఖాలీ ప్రాంతంలోని ఓ మసీదులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సదరు వ్యక్తి  నివాసం ఉంటున్నాడు. గత నెలలో ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్‌కు హాజరై వచ్చిన అతనికి శనివారం కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ జిల్లాలోని 14 గ్రామాలను అధికారులు సీజ్ చేశారు.

‘ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో, అతను ఉంటున్న గ్రామానికి మూడు కిలోమీటర్ల పరిధిలోని 14 గ్రామాలను జిల్లా యంత్రాంగం సీజ్ చేసింది. మొత్తం 14 గ్రామాల ప్రజలను క్వారంటైన్ చేశాం’ అని జిల్లా కలెక్టర్ కుమార్ ప్రశాంత్ తెలిపారు.

యూపీలోని ఆగ్రాలో సోమవారం మరో 30  కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో, ఆ జిల్లాలో వైరస్ బాధితుల సంఖ్య 134కు చేరుకుంది. వీరిలో దాదాపు 60 మంది తబ్లిగీ జమాత్‌కు హాజరై వచ్చిన వారే అని ఆ జిల్లా కలెక్టర్ చెప్పారు. ఇక యూపీలో ఇప్పటికి 483 మందికి కరోనా సోకింది.


More Telugu News