ఏప్రిల్‌ 20 తర్వాత లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపుపై స్పష్టతనిచ్చిన కిషన్‌ రెడ్డి

  • ఈ నెల 20 నుంచి కొన్నింటికి షరతులతో కూడిన అనుమతులు
  • అప్పటివరకు అన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాల్సిందే
  • పలు ప్రాంతాల్లో కేసులు అధికంగా ఉన్నాయి
  • చర్యలు తీసుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దవచ్చు
కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో మే 3 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రాలు మరిన్ని చర్యలు తీసుకుంటున్నాయి. ఏప్రిల్‌ 20 నుంచి అత్యవసర విషయాలకు కొన్ని ప్రత్యేక అనుమతులు ఉంటాయని ప్రధాని మోదీ ప్రకటించారు. అయితే, ఇందులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ఆ అనుమతులను వెనక్కి తీసుకుంటామన్నారు. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.

కిషన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 20 నుంచి కొన్నింటికి షరతులతో కూడిన అనుమతులు ఉంటాయని వివరించారు. ఈ నెల 20 వరకు అన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాల్సిందేనని తెలిపారు. దేశ వ్యాప్తంగా 46 జిల్లాల్లో ఇంతవరకూ ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదన్నారు.

దేశంలో కరోనా కేసులు తీవ్రస్థాయిలో లేకపోయినప్పటికీ, పలు ప్రాంతాల్లో మాత్రం కేసులు అధికంగా ఉన్నాయని చెప్పారు. వైరస్‌ కట్టడికి చర్యలు తీసుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దవచ్చని తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న వారు ఇళ్లల్లో సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉండాలని ఆయన చెప్పారు.

కాగా, లాక్‌డౌన్‌ పొడిగింపు నేపథ్యంలో దేశంలోని అన్ని ప్యాసింజర్‌ రైళ్లను మే 3 అర్ధరాత్రి వరకు రద్దు చేశారు. అలాగే, దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఉన్న నిషేధాన్ని కూడా మే 3 అర్ధరాత్రి వరకు నిషేధించారు.


More Telugu News