అదే కరోనా సమస్య పరిష్కారానికి ఏకైన మార్గం: ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్

  • వ్యాక్సిన్‌ కనుగొనాలి
  • లక్షల మంది ప్రాణాలు కాపాడొచ్చు
  • ప్రపంచం తిరిగి కోలుకునే అవకాశం ఉంటుంది
  • 2020 చివరి నాటికి వ్యాక్సిన్‌ను కనుగొనాలి
ప్రపంచాన్ని వణికిస్తోన్న కొవిడ్‌-19 సమస్య పరిష్కారానికి వ్యాక్సిన్‌ కనుగొనడమే ఏకైక మార్గమని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అన్నారు. తాజాగా ఆయన  దాదాపు 50 అఫ్రికా దేశాలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వ్యాక్సిన్‌ కనుగొనడం వల్ల లక్షల మంది ప్రాణాలు, లక్షల కోట్ల నిధులను ఆదా చేయొచ్చని తెలిపారు.

వ్యాక్సిన్‌ కనుగొంటేనే ప్రపంచం తిరిగి కోలుకునే అవకాశం ఉందని చెప్పారు. కరోనాకు మందును త్వరగా కనుగొనాలని ఆంటోనియో గుటెరస్ అన్నారు. ఆ మందు ప్రపంచ వ్యాప్తంగా అందరికీ ఉపయోగపడేలా ఉండాలని చెప్పారు. 2020 చివరి నాటికి వ్యాక్సిన్‌ను కనుగొనాలని తెలిపారు.

కరోనాను ఎదుర్కోడానికి 2 బిలియన్ డాలర్ల విరాళాలు ఇవ్వాలని గత నెల విజ్ఞప్తి చేస్తే, అందులో ప్రపంచ దేశాల నుంచి 20 శాతం సేకరించామని అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా తాము 47 ఆఫ్రికా దేశాల్లో కరోనా పరీక్షలు జరిపిస్తామని చెప్పారు.

కరోనాపై పోరాడుతున్న పలు దేశాలు చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించడానికి ఉగాండా, నమీబియా, ఈజిప్ట్ ప్రభుత్వాలు తీసుకున్న చర్యలను ఆయన కొనియాడారు.  

కాగా, ప్రపంచ వ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య ఇరవై లక్షలకు మించిపోయింది. దీని వల్ల ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయి. వేలాది మంది ఉద్యోగాలు పోతున్నాయి. ఇప్పటికే పలు దేశాలు వ్యాక్సిన్‌ కనుగొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. కరోనా వైరస్ కట్టడికి తయారుచేస్తున్న ఓ వ్యాక్సిన్‌ విషయంలో క్లినికల్ ట్రయల్స్‌కు చైనా ప్రభుత్వం తాజాగా ఆమోద ముద్ర వేసింది. మానవుడిపై పరీక్షలు జరిపేందుకు పచ్చ జెండా ఊపింది.


More Telugu News