ప్రజల జీవితాలను ప్రమాదంలో పెట్టొద్దు: లాక్‌డౌన్‌ సడలింపులపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ

  • లాక్‌డౌన్‌ సడలింపులపై కేంద్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహించాలి
  • మద్యం దుకాణాలను తెరవడం కరోనా విజృంభణకు కారణమవుతుంది
  • గృహ హింస పెరుగుతుంది
  • రెవెన్యూ కోసం ఇతర మార్గాలను చూసుకోవాలి
దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌లో సడలింపులు ఇస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, కరోనా విజృంభణ తగ్గక ముందే సడలింపులు ఇవ్వడం వల్ల ఇన్నాళ్లూ పాటించిన లాక్‌డౌన్‌ వృథా అవుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ సడలింపులు, మద్యం అమ్మకాలపై సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీ నారాయణ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

'లాక్‌డౌన్‌ సడలింపులపై కేంద్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహించాలి. మద్యం దుకాణాలను తెరవడం కరోనా విజృంభణకు కారణమవుతుంది.. శరీరంలో రోగ నిరోధకతను తగ్గిస్తుంది. గృహ హింస పెరుగుతుంది, పరిస్థితులు ప్రతికూలంగా మారుతాయి' అని లక్ష్మీ నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు.

'రాష్ట్ర ప్రభుత్వాలు రెవెన్యూ కోసం ఇతర మార్గాలను చూసుకోవాలి. ప్రజల జీవితాలను ప్రమాదంలో పెట్టొద్దు' అని లక్ష్మీ నారాయణ సూచించారు. కాగా, మద్యం దుకాణాలు తెరవడంతో నిన్న గందరగోళ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.


More Telugu News