ఇప్పుడు కాపాడాల్సింది మధ్యతరగతి వేతన జీవులను కాదు: నీతి ఆయోగ్ సంచలన వ్యాఖ్యలు

  • స్వస్థలాలకు వెళ్లిన కార్మికుల వల్ల నష్టం అతి స్వల్పం
  • ఎంఎస్ఎంఈలను కాపాడుకోవడానికే ప్రాధాన్యత ఇవ్వాలి
  • వెళ్లినవారు వెళ్లినా 3 కోట్ల మంది ఉన్నారన్న రాజీవ్ కుమార్
కరోనా విజృంభణ, లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్థిక వృద్ధి పతనం కాగా, ఇప్పుడు కాపాడాల్సింది మధ్యతరగతి వేతన జీవులను కాదని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పన్నులు చెల్లించే వేతన జీవులకు రిలీఫ్ ఇచ్చే బదులు, ఎంఎస్ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు)లను కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అన్నారు.

వేల మంది వలస కార్మికులు తమతమ స్వస్థలాలకు వెళుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, కార్మికులు వెళ్లినందువల్ల పడే ప్రభావం అతి స్వల్పమేనని అభిప్రాయపడ్డారు. కేవలం అతికొద్ది కార్మికులే వెనక్కు వెళ్లిపోతున్నారని తెలిపారు. దేశంలో మరిన్ని నిబంధనల సడలింపులతో నాలుగో దశ లాక్ డౌన్ అమలుకానున్న నేపథ్యంలో, రాష్ట్రాలకు వలస కార్మికుల సమస్య తలనొప్పిగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీతో ఇటీవలి వీడియో కాన్ఫెరెన్స్ లో సైతం పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

ఇండియాలో సుమారు 7.2 కోట్ల మంది వలసదారులు ఉండగా, వారిలో 3.5 నుంచి 4.8 కోట్ల మంది మాత్రమే వివిధ రంగాల్లో పని చేస్తున్నారని చెప్పిన రాజీవ్ కుమార్, వీరిలో 50 నుంచి 60 లక్షల మంది మాత్రమే స్వస్థలాలకు బయలుదేరారని అంచనా వేశారు. లాక్ డౌన్ ముగియగానే, ఎక్కడివారు అక్కడ పనుల్లోకి దిగుతారని, తద్వారా ఆర్థిక వ్యవస్థ ముందడుగు వేస్తుందని తెలిపారు. స్వస్థలాలకు వెళ్లిన వారు వెళ్లగా, దాదాపు 3 కోట్ల మందికి పైగా కార్మికులు అందుబాటులోనే ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో ఎంఎస్ఎంఈలు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, వాటిని ఆదుకుంటేనే లాక్ డౌన్ తరువాత పరిస్థితులు వేగంగా అదుపులోకి వస్తాయని, లేకుంటే ఆర్థిక పతనం మరింతకాలం కొనసాగుతుందని పేర్కొన్నారు. కాగా, కేంద్రం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీలోనూ పరిశ్రమలకు పెద్దపీట వేస్తూ, పలు నిర్ణయాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.


More Telugu News