లాక్ డౌన్ తో ఉపాధి లేక ముంబయిలో టీవీ నటుడి ఆత్మహత్య

  • లాక్ డౌన్ తో ఆర్థిక కష్టాలు
  • అప్పుల భారం పెరిగిపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లిన నటుడు
  • తన నివాసంలో ఉరేసుకుని బలవన్మరణం
కరోనా నియంత్రణ కోసం విధించిన లాక్ డౌన్ అనేకమంది ఉపాధిని దూరం చేసింది. ముఖ్యంగా వినోదరంగంపై ఆధారపడిన కార్మికులను కష్టాల్లోకి నెట్టింది. కార్మికులే కాదు కొందరు నటీనటులు సైతం తీవ్ర సమస్యల్లో చిక్కుకున్నారు. షూటింగుల్లేక, చేతినిండా డబ్బు లేక కొందరు మానసిక సంక్షోభానికి గురవుతున్నారు. ఈ క్రమంలో ముంబయిలో మన్మీత్ గ్రేవాల్ అనే టీవీ నటుడు ఆత్మహత్య చేసుకోవడం తాజా పరిస్థితికి నిదర్శనం. 'ఆదాత్ సే మజ్బూర్', 'కుల్దీపక్' అనే టీవీ కార్యక్రమాల ద్వారా సుపరిచితుడైన మన్మీద్ విషాదకర పరిస్థితుల్లో తన నివాసంలో ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు.

మన్మీత్ వయసు 32 సంవత్సరాలు. ముబయిలోని ఖర్గార్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. మన్మీత్ ఆత్మహత్యపై స్నేహితుడు మంజీత్ సింగ్ రాజ్ పుత్ విచారం వ్యక్తం చేశాడు. మన్మీత్ ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నాడని, లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేకపోవడంతో సంపాదన కరవైందని తెలిపాడు. అప్పులు తీర్చలేక ఎంతో ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నట్టు వివరించాడు. అతడి భార్య ఇప్పటికీ తీవ్ర దిగ్భ్రాంతిలో ఉందని మంజీత్ పేర్కొన్నాడు. కాగా, మన్మీత్ గ్రేవాల్ లాక్ డౌన్ కు ముందు కొన్ని వెబ్ సిరీస్ లు, అడ్వర్టయిజ్ మెంట్లలో నటించినా, లాక్ డౌన్ కారణంగా అవి నిలిచిపోయాయి.


More Telugu News