28 ఏళ్ల తరువాత... అణు పరీక్షలకు కదిలిన అమెరికా

  • 1992 తరువాత అణు పరీక్షల జోలికెళ్లని అమెరికా
  • తాజాగా తిరిగి జరిపించేందుకు చర్చలు
  • వాషింగ్టన్ పోస్ట్ ప్రత్యేక కథనం
దాదాపుగా 28 సంవత్సరాల తరువాత అమెరికా అణు పరీక్షలు జరపాలని భావిస్తోందని, రష్యా, చైనాలకు తీవ్ర హెచ్చరికలు పంపించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమానికి ట్రంప్ సర్కారు ఓకే చెప్పిందని 'వాషింగ్టన్ పోస్ట్' ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ నెల 15న అణు పరీక్షలు జరపడంపై చర్చలు జరిగాయని, తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని ట్రంప్ ప్రభుత్వంలోని ఓ అధికారి వెల్లడించినట్టు ఈ కథనం పేర్కొంది.

ర్యాపిడ్ టెస్ట్ లను జరిపించడం ద్వారా రష్యా, చైనాలకు తన సత్తాను చాటి, అటామిక్ వెపన్స్ విషయంలో ఓ త్రైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకోవడమే యూఎస్ లక్ష్యమని ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. ఇదే జరిగితే, స్వీయ రక్షణ విధానానికి అమెరికా తూట్లు పొడిచినట్టేనని, పలు ఇతర దేశాలు కూడా అణు పరీక్షలకు దిగితే, తీవ్రమైన పోటీకి దారి తీసి, అణ్వస్త్ర వ్యతిరేక ఉద్యమానికి విఘాతం కలుగుతుందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.

అమెరికా అణు పరీక్షలకు దిగితే, నార్త్ కొరియాకు అడ్డుకట్ట వేయడం క్లిష్టతరమవుతుంది. అణు పరీక్షలపై విధించిన మారటోరియంకు కిమ్ జాంగ్ ఉన్ కట్టుబడి ఉండే అవకాశాలు లేవని, చివరకు ఇది సరికొత్త ప్రచ్ఛన్న యుద్ధానికి దారి తీయవచ్చని ఆర్మ్స్‌ కంట్రోల్‌ అసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డారిల్‌ కింబల్ అభిప్రాయపడ్డారు. 1992లో అణు పరీక్షలు చేసిన తరువాత, అమెరికా మరోమారు వాటి జోలికి వెళ్లలేదు.


More Telugu News