వారం రోజులు ఆగండి.. చైనాను ఏం చేస్తామో మీరే చూడండి: ట్రంప్

  • హాంకాంగ్‌పై చైనా పెత్తనాన్ని నిరసిస్తున్న అమెరికా
  • వారం రోజుల్లోనే కఠిన చర్యలు ఉంటాయన్న ట్రంప్
  • ఆ నిర్ణయం అత్యంత ఆసక్తికరంగా ఉంటుందంటూ ఉత్సుకత పెంచిన ట్రంప్
హాంకాంగ్ విషయంలో చైనా వైఖరిని తొలి నుంచీ దుయ్యబడుతూ వస్తున్న అమెరికా.. డ్రాగన్ కంట్రీపై చర్యలకు సిద్ధమవుతోంది. తాము తీసుకునే నిర్ణయం చాలా కఠినంగా ఉంటుందన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఏం చేయబోతున్నదీ మాత్రం చెప్పలేదు. అయితే, అదేదో వారం రోజుల్లో తెలుస్తుందని, అప్పటి వరకు వేచి చూడాలని విలేకరులను కోరారు. అంతేకాదు, తాము తీసుకునే నిర్ణయం అత్యంత ఆసక్తి కలిగించేదిగా ఉంటుందని, అది చాలా శక్తిమంతమైన నిర్ణయమంటూ ఉత్సుకతను పెంచే వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇంతకుమించి వివరాలను వెల్లడించేందుకు నిరాకరించారు.
 
స్వయం ప్రతిపత్తి హోదా కలిగిన హాంకాంగ్‌ను స్వాధీనం చేసుకునేందుకు గత కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్న చైనా.. హాంకాంగ్‌లో జాతీయ భద్రతా చట్టాన్ని అమలు చేసేందుకు అనువుగా ముసాయిదా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదం తెలిపింది. చైనా తీరుపై హాంకాంగ్‌లో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో ఆ దేశాన్ని గుప్పిట్లో పెట్టుకుని, తమ కంపెనీలను బ్రిటన్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లలో లిస్ట్ చేయడం ద్వారా అమెరికాకు చెక్ చెప్పాలని భావిస్తోంది. ఇది ముందే గ్రహించిన ట్రంప్ చైనాపై చర్యలు తప్పవని ఇటీవల ప్రకటించారు. తాజాగా, మరోమారు అదే విషయాన్ని పునరుద్ఘాటించారు. అయితే, ఈసారి వారం రోజుల్లోనే అదేదో మీరే చూస్తారంటూ చెప్పడం గమనార్హం.


More Telugu News