కరోనా నేపథ్యంలో చైనా వక్రబుద్ధిపై అంతర్జాతీయ మీడియా కథనం

  • చైనా తీరుతెన్నులను ఎండగట్టిన అసోసియేటెడ్ ప్రెస్
  • ఉద్దేశపూర్వకంగానే వైరస్ వ్యాప్తిని దాచిందని ఆరోపణలు
  • డబ్ల్యూహెచ్ఓ నిస్సహాయంగా మారిందని వెల్లడి
కరోనా వైరస్ వ్యాప్తి తీరుతెన్నులను, వైరస్ కు సంబంధించిన శాస్త్రీయ వివరాలను చైనా ఉద్దేశపూర్వకంగానే తొక్కిపెట్టిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేలా అంతర్జాతీయ మీడియా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) ఆసక్తికర వివరాలు వెల్లడించింది. అది కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అధికారులను ఉటంకిస్తూ సంచలన వివరాలు బయటపెట్టింది.

ఏపీ కథనం ప్రకారం.... చైనాలో కరోనా వ్యాప్తి జరుగుతున్న సమయంలో ఆ కొత్త వైరస్ గురించి ఇతర దేశాలకు ఎంత మేరకు తెలుసో ప్రపంచ ఆరోగ్య సంస్థకు కూడా అంతే తెలుసు. అందుకే చైనా ఏంచెప్పినా, ఏంచేసినా ప్రశంసలు కురిపించింది. కరోనా వ్యాప్తిని సకాలంలోనే ప్రపంచానికి వెల్లడించిందని, వ్యాక్సిన్ తయారీ, ఔషధాల ఎంపికలో విశేషంగా తోడ్పడే కరోనా వైరస్ జన్యుక్రమాన్ని  కూడా చైనా ఆలస్యం చేయకుండా ఇతర దేశాలతో పంచుకుందని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. కానీ వాస్తవం మరోలా ఉంది. చైనాలో కరోనా వ్యాప్తి మొదలైన వెంటనే అక్కడి వైరాలజీ ల్యాబ్ లు ఆ వైరస్ గుట్టుమట్లన్నీ కనిపెట్టేశాయి. దాని జన్యుక్రమాన్ని ఆవిష్కరించడమే కాదు, జన్యుపటాలను కూడా రూపొందించాయి.

అయితే చైనా ప్రభుత్వం ఈ దశలో ఎంతో కఠినంగా వ్యవహరించింది. వైరస్ కు సంబంధించిన ఎలాంటి సమాచారం వెల్లడి చేయొద్దంటూ అక్కడి వైరాలజీ ఇన్ స్టిట్యూట్ లకు రహస్య ఆదేశాలు జారీచేసింది. కరోనా గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడంలో అందరికంటే ముందున్న వుహాన్ లోని వైరాలజీ ల్యాబ్ కూడా ఈ విషయంలో మిన్నకుండిపోయింది. ఈ ల్యాబ్ లో 'బ్యాట్ ఉమన్' గా పేరుగాంచిన షి ఝెంగ్లీ డిసెంబరు 30నే అందరినీ అప్రమత్తం చేసినా, ఆ సమాచారం చైనా సరిహద్దులు దాటి బయటికి రాలేకపోయిందంటే చైనా అధినాయకత్వం వ్యవహరించిన తీరు అర్థమవుతుంది.

ఈ వైరస్ జన్యుక్రమాన్ని పూర్తిస్థాయిలో డీకోడ్ చేసింది జనవరి 2న కాగా, కరోనా వైరస్ ను మహమ్మారి అని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది జనవరి 30న. ఈ వ్యవధిలో కరోనా విపరీతంగా వ్యాప్తి చెంది నేడు ప్రపంచదేశాలను కలవరానికి గురిచేసే స్థాయికి చేరింది. ఒక విధంగా సభ్య దేశాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడే డబ్ల్యూహెచ్ఓ తన వద్ద ఉన్న అరకొర సమాచారంతో కరోనా ప్రమాద స్థాయిని అంచనా వేయలేకపోయింది.  కొన్నివారాల పాటు కరోనా వ్యాప్తిని దాచిన చైనా చివరికి తన అధికారిక మీడియాలో వెల్లడించే 15 నిమిషాల ముందు డబ్ల్యూహెచ్ఓకి సమాచారం అందించిందని చైనాలోని డబ్ల్యూహెచ్ఓ ముఖ్య అధికారి డాక్టర్ గాడెన్ గాలీ వెల్లడించారు.

చైనా నుంచి వచ్చిన సమాచారం మేరకు ఇది మహమ్మారి అని ప్రకటించేసరికి వైరస్ ప్రపంచవ్యాప్తమైందని అసోసియేటెడ్ ప్రెస్ తన కథనంలో వివరించింది. కరోనాపై చైనా అవసరమైన మేరకు సరైన సమాచారం ఇవ్వలేదని, ఇచ్చిన సమాచారం కూడా అసంపూర్ణంగా ఉండడంతో తాము నిస్సహాయులుగా మారామని డబ్ల్యూహెచ్ఓ అధికారులు తెలిపినట్టు వివరించింది.


More Telugu News