టాప్-4 స్థానానికి ఇండియా... కరోనా కేసుల్లో బ్రిటన్ ను దాటేసిన వైనం!

  • ఇండియాలో మొత్తం కేసుల సంఖ్య 2,95,772 
  • టాప్ 10కు వచ్చిన 18 రోజుల్లోనే టాప్-4కు
  • ఇండియాకన్నా ముందున్న యూఎస్, రష్యా, బ్రెజిల్
ఇండియాలో కరోనా మహమ్మారి విజృంభణ వేగం మరింతగా పెరిగింది. ఈ క్రమంలో మొత్తం కరోనా కేసుల విషయంలో ఇండియా, బ్రిటన్ ను దాటేసింది. అత్యధిక కేసులున్న దేశాల్లో నాలుగో స్థానానికి ఎగబాకింది. తొలి స్థానంలో 20 లక్షలకు పైగా కేసులతో అమెరికా ఉండగా, ఆ తరువాత  బ్రెజిల్ లో 7.72 లక్షల కేసులు, రష్యాలో 4.93 లక్షల కేసులు ఉన్నాయి.

ఇండియాలో మొత్తం కేసుల సంఖ్య 2,95,772కు చేరింది. ప్రస్తుతం బ్రిటన్ లో ఇండియాకన్నా తక్కువగా 2,91,588 కేసులు ఉన్నాయి. మే 24 నుంచి భారతావనిలో కరోనా మహమ్మారి విజృంభణ శరవేగమైంది. ఇండియా టాప్-10 బాధిత దేశాల్లోకి చేరింది. ఆ తరువాత 18 రోజుల వ్యవధిలోనే నాలుగో స్థానానికి చేరింది. ఈ క్రమంలో స్పెయిన్, ఇటలీ వంటి ఎన్నో దేశాలను దాటుకుంటూ వచ్చింది.

వాస్తవానికి ప్రపంచంలోనే అతిపెద్ద లాక్ డౌన్ ను అమలు చేసిన ఇండియా, తొలుత వైరస్ ను చాలా వరకూ అడ్డుకుంటున్నట్టే కనిపించింది. కానీ, మార్చి 25 తరువాత నిబంధనలను మరింతగా సడలించగా, ఆ సమయంలో రోజుకు సగటున 500 కేసులు, 10 మరణాలు సంభవించే పరిస్థితి నెలకొంది. ఆ తరువాత పరిస్థితి మారిపోయింది.

వారాల వ్యవధిలోనే రోజువారీ కేసుల సంఖ్య వందల నుంచి వేలల్లోకి పెరిగిపోయింది. ప్రస్తుతం రోజుకు సుమారు 10 వేల కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 9,996 కేసులు వచ్చాయి. ఒక రోజు కేసుల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఇక రోజువారీ మరణాల సంఖ్య కూడా 350కి పెరిగింది.

ఇప్పటివరకూ ఇండియాలో మరణాల సంఖ్య 8,500గా అధికారులు వెల్లడించారు. మొత్తం మరణాల్లో మహారాష్ట్ర తొలి స్థానంలో నిలిచింది. ఇక్కడ 3,482 మంది మరణించారు. మొత్తం కేసుల్లో మూడింట ఒక వంతు... అంటే దాదాపు లక్ష కేసులు జూన్ లోనే నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతం మాల్స్, రెస్టారెంట్లు, దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు తెరచుకోవడంతో సమీప భవిష్యత్తులో కేసుల సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.


More Telugu News